ఆదిలాబాద్ లోని BDnT LAB ను సందర్శించిన ఐటీ శాఖ – మంత్రి కే.తారకరామారావు

తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వ విధానం అని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలోని ఐటీ పార్క్ BDnT లాబ్స్ ఉద్యోగులతో డెలివరీ కిక్-ఆఫ్ సెర్మని లో రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఐటి శాఖ మంత్రి మాట్లాడుతూ, ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఐటి కంపెనీ NTT, BDnT ల్యాబ్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఆదిలాబాద్ ను కూడా ఐటీ మ్యాప్ లో పెట్టిన ప్రభుత్వ విజన్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతతో వరంగల్, కరీంనగర్,మహబూబ్ నగర్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు, యువతకు అవకాశాలు కల్పించడం ద్వారా హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల ఐటి కంపెనీలతో పోటీ పడతారని అన్నారు. ఆదిలాబాదు జిల్లాలో ఐటీ పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, పట్టుదల ఉంటే విజయం సాధిస్తారని అన్నారు. NTT, BDnT ల్యాబ్ లో పనిచేస్తున్న వారంతా ఉమ్మడి జిల్లా వాసులేనని, అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ సరాఫరాను మరింత మెరుగురిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటి ఉద్యోగుల కోరిక మేరకు శాశ్వత భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలంలో ఆధునీకరిస్తామని, ఒక కోటి యాభై లక్షల రూపాయలను మంజూరు చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ ఆధునీకరణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఆదిలాబాద్ లో సిసిఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అభివృద్ధికి పూర్తీ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదిలాబాదు శాసన సభ్యులు జోగురామన్న విజ్ఞప్తిమేరకు ఐదు ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ కు త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని, విదేశాల్లో ఉన్న పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూ దాతలు ముందుకు రావాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కశ్మీర్ ఆఫ్ తెలంగాణ అని అభివర్ణిస్తూ, గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదనాలు, జలపాతాలు, జోడేఘాట్ పర్యాటక ప్రాంతాలు, కుమ్రం భీం అద్భుతమైన సాంస్కృతిక సంపద ఇక్కడ ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని అందమైన ప్రదేశాలను అభివృద్ధి చేయాలనీ, పర్యాటక శాఖా మంత్రి కి సూచించారు. ఆదిలాబాదు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వారాంతపు సెలవుల్లో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుందని, పర్యాటక రంగాన్ని జిల్లాలో విస్తరించాలని కోరారు. అంతకుముందు ఐటి అధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రులతో సమావేశమై ఐటి కంపెనీ అభివృద్ధి, కావలసిన సౌకర్యాలు, తదితర అంశాలపై ఐటి శాఖ మంత్రి చర్చించారు. అనంతరం పలు విభాగాలను పర్యవేక్షించి ఉద్యోగులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అటవీ,పర్యావరణ,న్యాయ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పర్యాటక శాఖా మంత్రి  శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్సీలు దండే విట్టల్, శంబీపూర్ రాజు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బోథ్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, చిన్నయ్య, ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, ఎన్. నటరాజ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post