ఆదివాసీలు ఉన్నత లక్ష్యం సాధించే దిశగా ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదివాసీలు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆదివాసి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మితో కలిసి హాజరయ్యారు. ముందుగా రాయి సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కొమరం భీమ్ చౌక్ లో 12 ఫీట్ల కాంస్య విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ చేసి అనంతరం ర్యాలీగా ఆదివాసి భవనంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివాసి ప్రాంతాలు పరిశుభ్రత లో ప్రథమ స్థానంలో ఉండడం అభినందనీయమని, ప్రకృతిని ఆరాధించే ఆదివాసీలు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. జిల్లాలో పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరిగిందని, పోడు భూముల చట్టం ప్రకారం వాటి పరిష్కారం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 18 మాతృ మరణాలు చోటు చేసుకున్నాయని, నియంత్రణ దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించిన ప్రకారం ఆదివాసీలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వ్యాక్సినేషన్ తో పాటు వైద్య అధికారులు ఇచ్చే మందులు వేసుకోవాలని తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు రక్షణ కోసం నడుం కట్టాలని, యువత ఆలోచించి రేపటి తరం సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రయత్నించాలని అన్నారు. జిల్లా కేంద్రంలో కొమరం భీమ్ చౌక్ వద్ద నిర్మించతలపెట్టిన కాంస్య విగ్రహాన్ని అక్టోబర్ లో జరిగే వర్ధంతి లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని అన్నారు. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న చిరుధాన్యాలను స్వీకరించి పౌష్టికాహారం పెంచుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని 8 తెగల వారు వారి సంస్కృతి సంప్రదాయాలను ఉట్టి పడేలా ప్రదర్శించిన గుస్సాడీ, డేంసా లాంటి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జెడ్. పి. టి. సి. నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి మణెమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సావిత్రి, ఎం. పి. పి. మల్లికార్జున్, జిల్లా వైద్యాధికారి మనోహర్, ఆదివాసీ సంఘాల నాయకులు భీమ్ రావు, మాణిక్ రావు, అర్జు, సుధాకర్, నారాయణ, సంతోష్ దశరథ్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారి జారీ చేయడమైనది

 

Share This Post