DPRO ADB- ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు చాల గొప్పవి- రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా కార్యదర్శి దివ్య దేవరాజన్ అన్నారు. గుస్సాడీ, దండారి సందర్బంగా నార్నూర్ మండలం జామడ గ్రామంలో నిర్వహించిన దండారి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్బంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మొదట పూజా కార్యక్రమాలు నిర్వహించి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, మిమ్మల్ని చూశాక నాకు చాలా ఆనందం కలిగిందని అన్నారు. కలెక్టర్ గా పనిచేసిన కాలంలో జంగుబాయి గా ఆదివాసీలు పిలిచేవారని అన్నారు.   నాకు ఇచ్చిన గౌరవాన్ని ఎన్నటికీ మరచిపోనని, ప్రస్తుతం పనిచేస్తున్న కలెక్టర్, ITDA పి.ఓ. మీ కుటుంబీకులుగా చూసుకోవాలని కోరారు. గ్రామంలోని సమస్యలను కలెక్టర్ పరిశీలిస్తుందని తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాకు కావలసిన సహకారం అందిస్తానని అన్నారు. ఆదివాసీ పిల్లలు బక్కగ ఉన్నారని పౌష్టికాహారం తీసుకొని బలవంతులుగా కావాలని అన్నారు. ఆరోగ్యం, చదువు పై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ఇప్పలడ్డు, చిరు ధాన్యాలు భోజనం చేయాలని అన్నారు. కేరళ రాష్ట్రంలో పిల్లలకు గ్రామాల సర్పంచులు  పౌష్టికాహారం అందించడంలో పోటీపడతారని తెలిపారు. కరోనా సమయంలో దండారి కి రాలేకపోయానని తెలిపారు. ప్రతి ఒక్కరు కలిసి మెలసి ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, దండారి లో పాల్గొనేందుకు దివ్య మేడమ్ రావడం ఆనందదాయకమని అన్నారు. సంప్రదాయంగా దీపావళి పండుగను నిర్వహించుకోవాలని అన్నారు.  ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని, మొదటి డోస్ తీసుకున్నవారు రెండవ డోస్, ఇప్పటివరకు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని కోరారు. దండారీ పండుగకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందని వాటిని ITDA ద్వారా పంపిణీ జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, దండారిని ఐక్యతతో నిర్వహించుకుంటారని తెలిపారు. మండలం లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్ మాట్లాడుతూ, గ్రామానికి అంగన్వాడీ భవనం, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, పిల్లలకు పోషన్ అభియాన్ క్రింద పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం దండారి కోసం మంజూరు చేసిన కోటి రూపాయలను పంపిణీ చేయనున్నామని తెలిపారు. అనంతరం మహిళలతో కార్యదర్శి, కలెక్టర్ లు దిమ్సా నృత్యం చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్, కలెక్టర్, ITDA పి.ఓ.లు చెక్కులను పటేల్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎంపిపి మోతుబాయి, జిల్లా సర్ మెడి దుర్గు పటేల్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, DTDO సంధ్యారాణి, DWO మిల్కా, సర్పంచ్,ఎంపీటీసీ, గ్రామస్తులు, తహసీల్దార్ ఎంపీడీఓ, గుస్సాడీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post