ఆదివాసీ కళాకారులకు ఆదరణ కల్పించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 27, 2021, ఆదిలాబాదు:-

            అంతరించి పోతున్న ఆదివాసీ కళాకారులను ప్రోత్సహిస్తూ, వారు తయారుచేసిన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్ లో స్తానం కల్పించేలా డాక్యుమెంటరీ తయారు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున స్థానిక కళాశ్రమం లో ఆదివాసీ ఓజా కళాకారులు తయారుచేస్తున్న వస్తువులపై ఐదు రోజుల వర్క్ షాప్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న ఆదివాసీ కళాకారుల చేతి వృత్తి వస్తువులను మార్కెట్ లోకి తీసుకువచ్చేల ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పూజ కార్యక్రమాలలో వినియోగించే వస్తువులు, సుందరంగా షో కేసుల్లో ప్రదర్శించుకునే వివిధ రకాల వస్తువుల తయారుచేసే విధానం పై ఐఐటి హైదరాబాద్ వారిచే డాక్యుమెంటరీ తయారుచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని సుమారు 10 మంది కళాకారులచే వస్తువులను తయారుచేయిస్తూ డాక్యుమెంటరీ చేయడం అభినందనీయమని తెలిపారు. కళాకారులు తయారుచేస్తున్న వాటిపై సుదీర్ఘంగా వివరించాలని, వారికీ ఆదరణ కల్పిస్తూ, ఆర్థికంగా ఎదిగే విధంగా డాక్యుమెంటరీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ దీపక్ జాన్ మ్యాతుస్, స్థానికులు, కళాశ్రమం నిర్వాహకులు పాల్గొన్నారు.

Share This Post