ఆదివాసీ గర్భిణీలకు ఇప్పపువ్వు లడ్డులను పంపిణి చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రక్త హీనత తో బాధపడుతున్న గిరిజన మహిళలకు ఇప్పపువ్వు లడ్డు అందించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేదిశగా పైలట్ ప్రాజెక్టు కింద పంపిణి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని నిలగొంది గిరిజన గ్రామంలో ఇప్పపువ్వు లడ్డులను గర్భిణీ మహిళలకు పంపిణి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన జిల్లాలోని ఉట్నూర్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలాల్లో 200 మంది గర్భిణీలకు ఇప్పపువ్వు లడ్డులను అందించి వారి హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించడానికి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గిరిజన జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3000 మంది గర్భిణీలకు ప్రతిరోజూ ఇప్పపువ్వు లడ్డులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజుకొకటి చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. రక్త హీనత తో బాధ పడుతున్న మహిళలు రిమ్స్ ఆసుపత్రికి రావడం జరుగుతుందని తెలిపారు. హిమోబ్లాబిన్ శాతాన్ని పెంచడానికి పౌష్టికాహారం అందించడంలో భాగంగా ఇప్పపువ్వు లడ్డును గర్భిణీలకు పంపిణి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మన అందరి బాధ్యత అని అన్నారు. గతంలో ఈ జిల్లాలో కలెక్టర్ గా పని చేసిన దివ్యదేవరాజన్ ప్రస్తుతం హైదరాబాద్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారని వారి సూచనల మేరకు, వారి ప్రణాళికలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నిలగొంది అంగన్వాడీ కేంద్రంలో గార్డెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. అంతకు ముందు వ్యాక్సిన్ పంపిణి కేంద్రాన్ని పరిశీలించి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించి వందశాతం వ్యాక్సిన్ అందించాలని సూచించారు. ITDA ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ, ఇప్పపువ్వుతో పాటు ఇతర పోషక పదార్థాలను కలిపి ఇప్పపువ్వు లడ్డును తయారుచేసి గర్భిణీలకు అందించడం ప్రారంభించామని అన్నారు. సాంప్రదాయ గిరిజన పంట ఇప్పపువ్వు అని, పోషక విలువలు కలిగిన పదార్థాలు వలన మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని అన్నారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా ఇప్పపువ్వు సేకరణ జరుగుతున్నదని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రము లోని ఇతర గిరిజన గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దోహద పడుతుందని అన్నారు. జాతీయ పోషక సంస్థ వారు గర్భిణీల హిమోగ్లోబిన్ శాతం తీసుకోవడం జరిగిందని, ఆరు నెలల తరువాత ఇప్పపువ్వు లడ్డు తిన్న అనంతరం మళ్ళి హిమోగ్లోబిన్ శాతం పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ లడ్డు తిన్న ఆరు మాసాల అనంతరం హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి మాట్లాడుతూ, రక్త హీనత తో బాధ పడుతున్న మహిళలకు ఇప్పపువ్వు లడ్డు అందించడం సంతోషకరమని అన్నారు. అనంతరం గర్భిణీలకు ఇప్పపువ్వు లడ్డులను కలెక్టర్, ITDA పిఓ, మహిళా కమిషన్ సభ్యురాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.జయవంత్ రావు, ఎంపీటీసీ మోహన్ సింగ్, జిల్లా సార్ మేడి దుర్గు పటేల్, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ తిరుమల, APO PTG రమణ, సీడీపీఓ శ్రావణి, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post