ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించి బాల కార్మికులు, అనాధ పిల్లలు, అత్యాచారానికి గురైన పిల్లలకు పూర్తి రక్షణ కల్పించాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఆపరేషన్ స్మైల్ పకడ్బందీగా నిర్వహించి బాల కార్మికులు, అనాధ పిల్లలు, అత్యాచారానికి గురైన పిల్లలకు పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ లైన్ డిపార్టుమెంట్ అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం జనవరి మాసములో ప్రత్యేకంగా నిర్వహించే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ విధివిధానాలు పటిష్టంగా అమలు పరచడం పై గురువారం ఉదయం జిల్లా ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాల లోపు ఉండే అనాధ బాలలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాప్ తడితరాల్లో పనిచేసే బాల కార్మికులు, వెట్టిచాకిరి చేస్తున్న పిల్లలు ఎక్కడున్నా ఆపరేషన్ స్మైల్ ద్వారా పక్కా ప్రణాళికతో రెస్క్యూ చేసి పట్టుకోవాలని తెలిపారు. రెస్క్యూ చేసిన పిల్లలకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి వారిపై జరిగిన భౌతిక దాడులు, అత్యాచారాలు లాంటివి ఏమైనా జరిగాయా అనే కోణంలో పకడ్బందీగా విచారణ చేపట్టిన అనంతరం పిల్లలపై నేరానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీస్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులను సూచించారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కల్గిన పిల్లలు అంతకన్నా ఎక్కువ వస్యస్సు ఉన్న పిల్లలను వేరు చేసి వారికి అవసరమైన సహాయం మానసిక ధైర్యం చెప్పాలన్నారు. వారిని కె.జి.బి.లో కానీ హాస్టల్ లో కానీ చైల్డ్ హోమ్ లో పెట్టి విద్యను ఆ హ్యాసించే విధంగ చూడాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితులు, లేదా మూఢనమ్మకాలతో పిల్లలకు చదువుకు దూరం చేసి తాత్కాలిక సంపాదనకు పిల్లలను ఇబ్బందులు పెడుతుంటారని అలాంటి తల్లిదండ్రుల కు , పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి అలాంటి తప్పిదం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల రెస్క్యూ విషయంలో కానీ పోలీస్ కేసు విషయంలో చిన్న చిన్న తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా తప్పు చేసిన వారికి శిక్షలు పడటం లేదని అలాంటి నిర్లక్ష్యం చేయవద్దని నిర్లక్షయంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పుడు రెస్క్యూ చేసిన పిల్లలు 6 నెలల తర్వాత ఏంచేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే విషయం పై ఫొటోలతో సహా తదుపరి సమావేశంలో చూపించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఒక చైల్డ్ రెస్క్యూ హోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ కె. మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో ఆపరేషన్ స్మైల్ రెస్క్యూ కు మొత్తం 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కో బృందంలో ఒక ఎస్సై, 4 కానిస్టేబుల్, ఒక మహిళ కానిస్టేబుల్ తో పాటు జిల్లా సంక్షేమ శాఖ, రెవెన్యూ, లేబర్, బాలల సంరక్షణ విభాగం నుండి ఒక్కొక్కరి చొప్పున సభ్యులు ఉంటారని తెలిపారు. జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున పూర్తి సహాయం ఉంటుందని తెలియజేసారు. 18 సంవత్సరాల వస్యస్సు లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న వారి పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, ఆదనవు ఎస్పి రామేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి టి.యు. వెంకటలక్ష్మి, డి.సి.పి.ఓ నిరంజన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post