ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్ 18: జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే విధంగా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం స్థానిక పెంబర్తి రోడ్ లో ఆయిల్ ఫెడ్ వారిచే నిర్వహిస్తున్న ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ ఫెడ్ వారు మలేషియా నుండి ఫెల్టా [Telda ML161] అనే రకం ఆయిల్ ఫామ్ విత్తనాలను తీసుకువచ్చి నర్సరీలో పెంచుతున్నారన్నారు. ప్రస్తుతం 2 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ఇట్టి మొక్కలను పదినెలల నుండి సంవత్సరం వరకు నర్సరీలో పెంచిన తర్వాత రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఒకసారి ఆయిల్ ఫామ్ మొక్కలు నాటితే, నాల్గవ సంవత్సరం నుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరముల వరకు వస్తుందని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని కలెక్టర్ అన్నారు. అనంతరం కలెక్టర్ వడ్లకొండ గ్రామ రైతు రవీందర్ సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జనగామ ఆర్డివో మధు మోహన్, జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ అధికారిణి కె.ఆర్ లత, ఉద్యానవన అధికారి వి. అయిలయ్య, తెలంగాణ ఆయిల్ ఫెడ్ టెక్నికల్ మేనేజర్ జె. సత్యనారాయణ, డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ టి. రఘునందన్, ఫీల్డ్ ఆఫీసర్లు చంద్రశేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post