పత్రికా ప్రకటన
సిద్దిపేట 9 నంబర్ 2202.
ఆయిల్ ఫామ్ పంట వేయడానికి ముందుకు రావాలని పెద్ద మరియు మధ్యతరహా రైతులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. బుధవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ, ఉద్యాన మరియు ఆయిల్ ఫెడ్ వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరైన జిల్లా కలెక్టర్ ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతులకు ఉన్న అపోహలను విని ఉద్యాన మరియు ఆయిల్ ఫెడ్ అధికారులతో సందేహాలను నివృత్తి చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల ద్వారా తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య సంక్షేమ మరియు కుటుంబసంక్షేమశాఖ మాత్యులు పన్నీర్ హరీష్ రావులు జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి పిలుపునిచ్చారని అన్నారు. ఆయిల్ ఫామ్ పంట ఎలాంటి నష్టం లేని లాభదాయక పంట అని ఒకసారి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటితే మూడు సంవత్సరాల తర్వాత నుండి 30 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగానే నెలకు రెండుసార్లు ఆదాయం వస్తదని, ఒక ఎకరాకి సంవత్సరానికి 1లక్షా ,50 వేల రూపాయలకు పైననే ఆదాయం వస్తుందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ఉచితంగా మొక్కలను అందించడంతోపాటు డ్రిప్, స్ప్రింక్లర్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వడమే కాకుండా అంతర పంటలు పండించుటకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని, ముందే కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పంట మార్కెటింగ్ కోసం ఎలాంటి ఇబ్బంది పడకుండా వారే పంటను తీసుకెళతారని, మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు హరీష్ రావు జిల్లా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని గత ఏప్రిల్ మాసంలో నర్మెట్ట గ్రామంలోని 360 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని పెద్ద, మధ్య తరగతి రైతులు దీర్ఘకాలంలో అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ ఫామ్ పంట కాలం, పంట దిగుబడి, సంవత్సరాల వారిగా పొందే ఆదాయం, పరికరాల సబ్సిడీ, అంతర పంట సాయం, మార్కెటింగ్ సౌకర్యం వివరాలను రైతులకు అర్థమయ్యే విధంగా ఒక కరపత్రం రూపంలో తీసుకురావాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ముజామిల్ ఖాన్, ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి రామలక్ష్మి, మార్క్ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, మార్క్ ఫెడ్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద, మధ్య కారు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Issued by District public Relation office Siddipet