ఆరుతడి పంటలతో ఆదాయం ఆర్జిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను ఇతర రైతులతో ఫీల్డ్ విజిట్ చేయించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

గురువారం నాడు ఆలేరు మండలం సాయిగూడెం గ్రామ రైతు అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సమీకృత వ్యవసాయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.  వ్యవసాయ క్షేత్రంలో పౌల్ట్రీతో పాటు సపోటా,  మామిడి, దోస, బెండ, బీరకాయ, టమాటా, గోంగూరతో పాటు మల్లెపూల తోటను సాగుచేస్తున్న పద్ధతులను  అడిగి తెలుసుకున్నారు.  అంతే కాకుండా 12 ఎకరాలలో ఉల్వలు , 7 ఎకరాలలో ఆవాలు పండిస్తున్న తీరును చూసి  జిల్లా కలెక్టర్  రైతు అంజిరెడ్డి ని అభినందించారు.  గత వానా కాలం 12 ఎకరాలలో పెసర్లు వేయడం జరిగిందని,  మంచి దిగుబడితో ఆదాయం సమకూరిందని రైతు అంజిరెడ్డి జిల్లా కలెక్టర్ కు  వివరించారు.  సమీకృత వ్యవసాయం ద్వారా అన్ని రకాల పంటలు పండిస్తూ రైతు అంజిరెడ్డి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు. వ్యవసాయ అధికారులు ఇలాంటి రైతుల వ్యవసాయ పద్ధతులను క్షేత్రస్థాయి పర్యటనలతో ఇతర రైతులకు ఆదర్శంగా చూపాలని, అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అనురాధ, వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకటేశ్వర రెడ్డి,  వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Share This Post