ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పాటుకు ప్రతి అంగన్వాడీ టీచరు కృషి చేయాలి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజ్

ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పాటుకు ప్రతి అంగన్వాడీ టీచరు కృషి చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మన్ననూర్ ఐ.టి.డి.ఏ గిరిజన భవనంలో అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి జిల్లా శిశు సంక్షేమ శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి శిశువు 1000 రోజుల వరకు చాలా ముఖ్యమైన రోజులని ఈ సమయంలోనే వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దితే ఆరోగ్యవంతునిగా ఎదుగుతారన్నారు. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు అంగన్వాడీ టీచర్, ఆయాలకు ఉంటుందని తెలియజేసారు. ఇందుకు చేయాల్సినది ప్రతి నెల పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం అన్నారు. పిల్లల ఎత్తు, బరువు, జబ్బ చుట్టు కొలత సరిగ్గా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేదా ఎత్తుకు దగ్గ బరువు లేనిపక్షంలో అలాంటి పిల్లలను స్యామ్, మ్యామ్ పిల్లలుగా గుర్తించి ఫోటో తీసుకోవాలన్నారు. అలాంటి పిల్లలకు ముందుగా ఆకలి పరీక్ష నిర్వహించాలని అందులో లోపం లేకుంటే వారికి అదనపు పోషకాహారం అందించడమే కాకుండా ప్రతి రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఒకవేళ ఆకలి పరీక్షలో పిల్లలు ఫెయిల్ అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ను చూపించాలని లేదా జిల్లా ఆసుపత్రిలో చూపించి ఆరోగ్య సమస్యలను వైద్యం చేయించాలన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలుగా గుర్తించిన వారికి ఆరోగ్య శాఖ, ఐ.టి.డి.ఏ., డి.ఆర్.డి.ఏ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తమ వంతు పూర్తి సహకారం అందించి ఆరోగ్యవంతులను చేయాలని కోరారు. ఐ.టి.డి.ఏ.ద్వారా గిరి పోషణ ఆహారాన్ని ఏజెన్సీ ఏరియాల్లో ఇవ్వడం జరుగుతుందని, అంగన్వాడీల ద్వారా బాలామృతం ప్లస్ ఆహారాన్ని అందించాలని సూచించారు. గ్రామంలో తక్కువ బరువు ఉన్న పిల్లలకు సర్పంచులు సైతం గ్రామ పంచాయతీ నిధుల నుండి పౌష్టికాహారం అందించాలని తెలియజేసారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పాలు, పప్పు, ఆయిల్ వంటివి అన్ని హైదరాబాద్ నుండి సరఫరా చేయడం జరుగుతుందని కేవలం గుడ్లు మాత్రం జిల్లా నుండి సరఫరా అవుతాయని తెలిపారు. అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు ఒక్కోటి 50 గ్రాములకు తగ్గకూడదని, ఒక్క గ్రామ్ తక్కువ ఉన్నా టీచర్లు ఆ గుడ్లు తీసుకోవద్దని తెలియజేసారు. పిల్లలు అందరు ఆరోగ్యవంతులుగా ఉంటే గ్రామం , జిల్లా, రాష్ట్రం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 56,432 చిన్న పిల్లలు ఉండగా అందులో 13 శాతం పిల్లలు అంటే 4227 మంది పిల్లలు తక్కువ బరువు లేదా ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలుగా గురించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మరో 7 శాతం పిల్లలకు ఈ నెలలో వివిధ కారణాల వల్ల బరువులు తీయలేకపోయారన్నారు. ఇక నుండి ప్రతి నెల వంద శాతం బరువులు తీయాలని, ఇప్పుడున్న 13 శాతం తక్కువ బరువు ఉన్న పిల్లల శాతాన్ని సున్నాకు తీసుకురావాలని అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. ముందుగా పిల్లలకు బరువులు సరిగ్గా ఎలా తీయాలో శిక్షణ ఇప్పించాలని అదనపు కలెక్టర్ ను సూచించారు. సి.డి.పి.ఓ లు సూపర్వైజర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని 3 నెలల్లో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఇడ్లి లాంటి చెంపలతో కనిపించాలని, 3 నెలల తర్వాత జిల్లాకు వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తానని తెలియజేసారు.
ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ కమిషనర్ దివ్య దేవరాజ్ చాలా అమూల్యమైన సూచనలు చేసారని జిల్లాలో తక్కువ బరువు ఉన్న పిల్లల శాతాన్ని 13 నుండి సున్న కు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. లైన్ డిపార్ట్మెంట్ లు అన్ని కలిసి సమన్వయంతో పని చేసే విదంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి వెంకటలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్ లాల్, పి.ఓ ఐ.టి.డి.ఏ అశోక్, పి.డి.డిఆర్డీఏ నర్సింగ్ రావు, ఇమ్యునైజేషన్ర్ అధికారి డా. సాయినాథ్ రెడ్డి, సి.డబ్ల్యూ.సి చైర్మన్ లక్ష్మణ్ రావు, అందరూ సి.డి.పి.ఓ.లు, సూపర్వైజర్ లు, సఖి వన్ స్టాప్ సిబ్బంది, పోషణ్ అభియాన్ సిబ్బంది, ప్రతి సెక్టార్ నుండి అంగన్వాడీ టీచర్లు తదితరులు సమీక్ష లో పాల్గొన్నారు.

Share This Post