ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా పనిచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 29: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. పోషణ్ అభియాన్ మాసోత్సవం సందర్బంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి, వారిని ఆరోగ్యంగా మారే వరకు ప్రతి ఒక్క పిల్లవానిని పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో 0 నుండి 6 మాసాల లోపు 3 వేల 39 మంది, 6 నెలల నుండి 3 ఏండ్ల లోపు 14 వేల 811 మంది, 3 ఏండ్ల నుండి 5 ఏండ్ల లోపు 10 వేల 900 మంది, మొత్తంగా 28 వేల 750 మంది లబ్దిదారులుండగా, 28 వేల 479 మంది ఎదుగుదలను పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. ఇందులో అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు 410 మంది, మధ్య తరహా పోషణ లోపం ఉన్న పిల్లలు ఒక వేయి 526 మందిని గుర్తించామన్నారు. పోషణ లోపం ఉన్న పిల్లల వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్, అడ్రస్ తో సహా నివేదిక సమర్పించాలన్నారు. సూపర్వైజర్లు, సీడీపీవోలు తమ పరిధిలోని పోషణ లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు మండల పర్యటనకు వెళ్ళినప్పుడు పిల్లల ఆకస్మిక తనిఖీలు చేసి, వారికి అందుతున్న పోషక ఆహారం, సేవల గురించి పర్యవేక్షణ చేయాలన్నారు. అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను ఏ విధంగా మధ్య తరహాలోకి తేవాలో, మధ్య తరహా వారిని పోషణ లోపం లేకుండా ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణీ, బాలింతలకు పోషకాహార లోపం వల్ల జరిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీలు, బాలింతలు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలో వారిలో చైతన్యం తేవాలన్నారు. పిల్లల పరిశుభ్రత, వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి వారి ఎదుగుదల సరిగ్గా లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి జిల్లాలో అనిమియాతో ఎవరు బాధపడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు కాక, ఇంకాను నమోదుకాని పిల్లలు ఉంటే వారిని కూడా పోషణ లోపం నుండి విముక్తి చేయాలన్నారు. సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని, ఏ దశలోనూ నిర్లక్ష్యం సహించేది లేదని, ఇది ఒక బాధ్యతగా గుర్తుంచుకొని విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ పోషణ్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, మండల ప్రత్యేక అధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post