ఆర్‌.ఓ.ఎఫ్‌. ఆర్‌. -2005 చట్టం ప్రకారం అర్హులైన పోడు రైతులకు పట్టాలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ఆర్‌.ఓ. ఎఫ్‌.ఆర్‌.-2005 చట్టం ప్రకారం జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న అర్హత గల రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లాలోని సిసి.సి. నస్పూర్‌లో గల సింగరేణి అతిథి గృహంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి అంకిత్‌, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ లతో కలిసి ప్రత్యేక అధికారులు, రాజస్వ మండల అధికారులు, అటవీ డివిజనల్‌ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండలాల తహశిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి అటవీ ఆక్రమిత భూములపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలతో ఆర్‌.ఓ. ఎఫ్‌.ఆర్‌., అడవి పరిరక్షణతో పాటు అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాలు, గ్రామాలు, హాబిటేషన్లలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటగా జిల్లా స్థాయిలో, తరువాత మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారులకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో అడవిని కాపాదేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, జిల్లాలో 311 గ్రామపంచాయతీలు, 86 రెవెన్యూ గ్రామాలు, 106 హాబిటేషన్స్‌ ఉన్నాయని, 8 వేల 400 ఎకరాలలో పోడు వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. ఆర్‌.ఓ. ఎఫ్‌. ఆర్‌. -2005 చట్టం ప్రకారం తేది : 18-12-2005కు ముందు నుండి భూములు సాగు చేస్తున్న షెడ్యూల్డ్‌ కులాల వారు అర్హులని, ఇతరులకు 75 సంవత్సరాల పాటు 3 తరాలుగా సాగు చేసుకుంటున్న వారికి ఈ చట్టం వర్తిస్తుందని, ఒక వ్యక్తి పేరిట 10 ఎకరాల కంటే మించి భూమి ఉండరాదని, భార్యభర్తల పేరిట జాయింట్‌ పట్టా ఉండాలని తెలిపారు. గ్రామసభల ఏర్పాటు సమయంలో 50 శాతం కంటే ఎక్కువగా మెజార్టీ ఉండాలని, ఫారెస్ట్‌ రైట్‌ కమిటీ పరిధిలో నిర్వహించు గ్రామసభల్లో నిబంధనల ప్రకారం సభ్యులు ఉండాలని, మహిళలు, ఎస్‌.టి. వారు లేని చోట చట్టం మేరకు ప్రత్యామ్నాయం తీసుకోవాలని తెలిపారు. రాజస్వ మండల అధికారి స్థాయిలో ఆర్‌.డి.ఓ. చైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెల 5వ తేదీ లోగా ఫారెస్ట్‌ రైట్‌ కమిటీ ఏర్పాటు చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ కమిటీలో 1/3 భాగం ఎస్‌.టి., 1/8 భాగం మహిళలు ఉండాలని, సంబంధిత సభ్యుల పేర్లు నిర్ణీత ఫార్మాట్‌లో సిద్దం చేసి జిల్లా కలెక్టరేట్‌లో అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల రవ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, మండల స్థాయిలో 5వ తేదీన, గ్రామపంచాయతీ స్థాయిలో 7వ తేదీన సమావేశాలు ఏర్పాటు చేసుకొని సిద్దంగా ఉండాలని, తహశిల్దార్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, అటవీ అధికారులు, బీట్‌ సెక్షన్‌ అధికారులతో పాటు సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, గ్రామ స్థాయిలో బృందాలు, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడంతో పాటు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అటవీ అభివృద్ధికి గ్రామపంచాయతీ, పురపాలక చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పట్టాల పంపిణీ తరువాత ఒక్క అంగుళం అటవీ భూమి కూడా ఆక్రమణ కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, సంబంధిత శాఖల
అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post