జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ఆమె బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీరు శక్తివంతంగా ఉండాలని, కష్ట కాలంలో ఎవరో వచ్చి కాపాడుతారు అనేది దూరం పెట్టాలని, అంగన్వాడి నుండి స్పేస్ లో పనిచేసే వరకు అన్ని రంగాలలో మహిళలు దూసుకెళ్తున్నారని అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష లేనప్పుడే, అదే నిజమైన వెలుగు అని, ఆడపిల్లైనా, మగ పిల్లవాడైనా ఒకటే అని, తల్లిదండ్రులు ఈ భేదభావం వీడి తమ ఇంటి నుండే ఇద్దరూ సమానం అనే దృష్టితో తీర్చిదిద్దాలని అన్నారు. కరోనా కష్ట కాలం నుండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ నడుస్తున్నందున సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉందని, యువతపై ఇంకా అధికంగా ఉందని, విద్య స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమిస్తున్నదని, ముఖ్యంగా బాల బాలికలు దీనికి దూరంగా ఉండాలని కోరారు. ఏదో తప్పు జరిగినప్పుడు అబ్బాయి త్వరగా బయటపడతాడని, అదే అమ్మాయి అంత త్వరగా బయటపడలేరని, వారిపై సమాజంలో చూసే చూపే కారణమని, దీనిని అందరూ రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలల్లో బాల బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన నేర్పించాలని, ముఖ్యంగా బాలికలకు తప్పనిసరిగా నేర్పించాలని ఆమె సూచించారు. ఏదైనా సంఘటన జరిగితే ఆడపిల్లల పట్ల చిన్నచూపు చూస్తారని, దీనివల్ల సొసైటీకి నష్టమని అన్నారు. ఇద్దరి పట్ల సమభావన అనేది ఇంటి నుండే ప్రారంభం కావాలని, మంచి చెడు పై వారికి విచక్షణ కల్పించాలని, ఇందుకు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందని అన్నారు. ఆడపిల్లలు, మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే దానికి వారి తల్లిదండ్రులు చూపిన సమదృష్టి, కృషే కారణం అన్నారు. ఆడపిల్లలు ఒక్క పెళ్లికి మాత్రమే కాకుండా, జీవితంలో చేసేవి ఇంకా చాలా ఉన్నాయని, తల్లిదండ్రులు వారి భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ప్రోత్సహించాలని అన్నారు.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, డిజిటల్ ప్లాట్ ఫామ్ వలన సైబర్ నేరాలు కూడా పెరిగాయని, డిజిటల్ ప్లాట్ ఫామ్ విద్య కోసం మాత్రమే వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలని అన్నారు. జిల్లాలో 16 ఎన్జీవో సంస్థలు, వాలంటీర్లు బాలికల హక్కుల పట్ల బాగా పాటుపడుతున్నారని అభినందించారు.
ఏ.సి.పి. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న నేరాలు, కిడ్నాపింగ్, ఆస్తి, కుటుంబ తగాదాలు, ప్రమాదాలపై, బాలికల బాలికల పట్ల జరుగుతున్న సంఘటనలు, దానికి చట్టం ద్వారా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి జిల్లాలో బాలికల రక్షణ పట్ల తీసుకుంటున్న సంరక్షణ చర్యలను వివరించారు.
కార్యక్రమంలో భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, ఇతర సంఘటనల పట్ల బాలికలు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. బాలికలు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు అద్భుతంగా నిర్వహించారు.
వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన 18 మంది బాలికలకు ప్రిన్సెస్ కిరీట ధారణ చేశారు.
ఈ సందర్భంగా న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాలు తెలిపే బ్రోచర్లను విడుదల చేయడం జరిగింది.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, ఎంపీపీ నిర్మల, జెడ్ పి టి సి మల్లయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బండారి జయశ్రీ, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ కృష్ణయ్య, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సైదులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, వివిధ శాఖలకు చెందిన అధికారిణులు, బాలికలు పాల్గొన్నారు.





