ఆహార కమీషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి ప్రతి ఒక్క బీదవానికి ఆహార భద్రత సక్రమంగా చేరేలా చూడవలసిన భాద్యత మీపై ఉందని అన్నారు

ఆహార కమీషన్ చైర్మన్ తిరుమల్  రెడ్డి ప్రతి ఒక్క బీదవానికి ఆహార భద్రత సక్రమంగా చేరేలా చూడవలసిన భాద్యత మీపై ఉందని అన్నారు

జిల్లాలో అందరికి ఆహార భద్ర కల్పించి ఆరోగ్యవంతమైన మెదక్ జిల్లాగా తీర్చిదిద్దుటకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆహార కమీషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి కోరారు. దేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క బీదవానికి ఆహార భద్రత కల్పించుటకు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నదని , అవి లబ్దిదారులకు సక్రమంగా చేరేలా చూడవలసిన భాద్యత మీపై ఉందని అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జిల్లాలో ఆహార భద్రత చట్టం 2013 అమలుతీరును సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలుకు గ్రామా,మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన విజిలెన్స్ కమిటీల పనితీరు, ప్రజలను చైతన్యపరచుటకు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సమస్యల పరిష్కారానికి చేపట్టిన మెకానిజం తీరుతెన్నులు తెలుసుకొనుటకు క్షేత్ర స్థాయిలో కమీషన్ పర్యటిస్తున్నదని అన్నారు. ఇక్కడ లబ్దిదారులకు అందిస్తున్న సేవలు, లోపాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సూచనలు,సలహాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటకు కమీషన్ శ్రమిస్తున్నదని అన్నారు. దాని ఫలితమే ఇటీవల రాష్ట్రంలో 3 లక్షల లబ్దిదారులకు కొత్తగా రేషన్ కార్డులు అందాయని అన్నారు. ఈ కమీషన్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించిందని అవి… చౌక ధరల దుకాణాల ద్వారా నిరుపేద ప్రజలకు నిత్యావసరాల సరుకులు సకాలంలో లబ్ధిదారులకు అందిస్తున్నారా, పాఠశాలలో పిల్లలకు మెనూ ప్రకారం మధ్యాన్నం భోజనం ఇస్తున్నారా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నారా, ప్రసూతి తల్లులకు కె.సి.ఆర్. కిట్టు అందజేస్తున్నారా, ఆడబిడ్డయితే 13 వేలు, మగ బిడ్డయితే 12 వేలు అందజేస్తున్నారా అని పరిశీలిస్తున్న దని అన్నారు. ప్రధానంగా అధికారులకు చట్టాలపై అవగాహన కలిగి ఉంటె సగం సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. కాబట్టి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాలు ఏర్పాటు చేసుకొని లబ్దిదారులకు చట్టం కల్పించిన హక్కులపై అవగాహన కలిగించాలన్నారు. లబ్దిదారులకు లోపాలు లేకుండా నాణ్యతతో కూడిన సేవలు నిరంతరాయంగా అందించాలని, ఇబ్బందులుంటే కమీషన్ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖను సమీక్షిస్తూ జిల్లాలో అర్హులైన ప్రతి బీదవానికి రేషన్ కార్డులు అందించుటకు గాను నిజంగా కార్డులు అవసరం లేని వారు స్వచ్ఛందంగా కార్డులు సరెండర్ చేసి పేదవాడికి సహాయపడాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 52 చౌక ధరల దుకాణాలతో పాటు అదనంగా ఏర్పడిన 157 గ్రామా పంచాయతీలకు గాను మరో 30 ఎఫ్.పి ఎస్. లు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాన్గానికి సూచించారు. లబ్ధిదారునికి నాణ్యమైన బియ్యం అందేలా చూడాలని, డీలర్లు సమయపాలన పాటించేలా చూడాలని, ప్రతి దుకాణం వద్ద కార్డుదారులు వివరాల జాబితా ప్రదర్శించేలా చూడాలన్నారు. రేషన్ కార్డు అనేదే కేవలం సరుకులు తీసుకోవడానికే ఇతర పథకాలకు వర్తించదన్న విషయం లబ్దిదారులకు వివరించాలన్నారు.
పాఠశాల విద్యార్థులకు మధ్యాన్న భోజన పధకాన్ని సమీక్షిస్తూ చాలా మంది విద్యార్థులు సరైన ఆహారం లేక రక్తహీనత, పౌష్టికాహార లోపంతో ఉన్నారని, దేశ ఆర్థిక సంపద, మానవ సంపదపై ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తెరిగి ఉపాధ్యాయులు మిడ్ డే మీల్స్ ను పర్యవేక్షిస్తూ ప్రోటీన్లతో కూడిన ఆహారం అందించాలని అన్నారు. పిల్లలకు ఆరోగ్య పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఆర్.బి.ఎస్. కార్యక్రమం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూచించారు.
అంగన్వాడీ కేంద్రాలలు చిన్న గ్రుడ్లు ఇస్తున్నారని ఫిర్యాదులున్నాయని, విజిలెన్స్ కమిటీ సమావేశమై బాలింతలకు, శిశువులకు పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలన్నారు. ఐ.సి..డి.ఎస్. లో ఖాళీగా ఉన్న 191 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖను సమీక్షిస్తూ అర్హులైన ప్రతి లబ్దిదారుకి కె .సి.ఆర్.కిట్ అందేలా చూడాలన్నారు. దేశంలో 58 శాతం జన్మనిచ్చే మహిళలు ఆరోగ్యవంతులుగా లేరని వారికి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ శాఖా ద్వారా అమలవుచున్న కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లా పరిషద్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కమీషన్ సూచించినట్లు గ్రామా, మండల, జిల్లా స్థాయి సమావేశాలలో ఆహార భద్ర చట్టం పై సమీక్షించి ప్రజలలో అవగాహన కలిగిస్తామని అన్నారు.
అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ ప్రజలశ్రేయస్సే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు. కమీషన్ సూచించిన విధంగా గ్రామా,మండల, జిల్లా స్థాయిలో, మునిసిపల్ పట్టణాలలో విజిలెన్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలను సమీక్షించి సమస్యలు, లోపాలను తెలుసుకొని నివేదికలను కమీషన్ కు అందజేస్తామన్నారు.
ఈ సమావేశంలో పలువురు సర్పంచులు, ఏం.పి పి .లు, జెడ్.పి .టి.సి.లు త అభిప్రాయాలను తెలియజేస్తూ చాలా మంది అర్హులైన బీదవారికి రేషన్ కార్డులు అందలేవని, లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం, చక్కర, గోధుమలు ఇవ్వడం లేదని అంగన్వాడీలో గ్రుడ్లు చిన్నవి ఇస్తున్నారని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, డి.డబ్ల్యూ.ఓ. జయరాం నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు , ఆర్.డి.ఓ.లు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, ఏం.ఈ.ఓ.లు, తహసీల్ధార్లు,ఏం.పి .డి.ఓ.లు, సి.డి.పి .ఓ.లు, జెడ్.పి .టి.సి.లు, ఏం.పి .పి .లు, సర్పంచులు, రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post