ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచండి-రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే.తిరుమల్ రెడ్డి .

ఆగష్టు 27, 2021ఆదిలాబాదు:-

రాష్ట్ర ఆరోగ్య సంపద బాగుండాలంటే పోషకాహారం అందించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే.తిరుమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార భద్రతపై సంబంధిత శాఖల అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సర్పంచ్ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో 2013 సంవత్సరంలో ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగిందని, మన రాష్ట్రము లో 2015 నుండి ఆ చట్టాన్ని అమలు పరచడం జరుగుచున్నదని తెలిపారు. రాష్ట్రం లో ఆరోగ్య వంతమైన జన సంపదకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని, వాటిని అమలు పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. రాజ్యాంగ పరంగా చట్ట ప్రకారంగా కల్పించిన ఆహార భద్రత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. మనదేశంలో 25 శాతం ఆకలి మరణాలు జరుగుచున్నాయని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలనీ అన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి సమీక్షలు నిర్వహించాలని, విజిలెన్స్ కమిటీలను బలోపేతం చేయాలనీ అన్నారు. కమిటీలు పక్కాగా పని చేయాలనీ, సోషల్ అడిట్ నిర్వహణ జరగాలని, చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పౌర సరఫరాలు అంశాలపై సమీక్షిస్తూ, ప్రతి పేద వాడికి సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందే విధంగా పంపిణి జరగాలని అందుకు కావలసిన సదుపాయాలను సమకూర్చాలని అన్నారు.  ఖాళీగా ఉన్న చౌక దరల దుకాణాలను భర్తీ చేయాలనీ సూచించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి కమిషన్ తీసుకువెళ్తుందని తెలిపారు.  శిశు సంక్షేమ శాఖపై సమీక్షిస్తూ, పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరైన సమయంలో సరఫరా కావడం లేదని కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ, ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయాల పోస్ట్ లను త్వరలో భర్తీ చేయాలనీ కలెక్టర్ కు సూచించారు. పౌష్ఠిక ఆహారం సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూడాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు పరచాలని, RBSK కార్యక్రమం కింద ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్య ఆరోగ్యపై సమీక్షిస్తూ, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అమ్మ ఒడి కార్యక్రమం కింద అందించే నగదు పై విస్తృత ప్రచారం జరగాల్సిందని, ఏ సమయంలో ఎంత డబ్బు లబ్ది జరుగుతుంది అనే విషయాలను తెలియపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర పథకాలు సుఖీభవ, జనని సురక్ష యోజన వంటి కార్యక్రమాలు కూడా అమలు పరచాలని సూచించారు. తూనికలు కొలతల శాఖల అధికారులు చౌక దరల దుకాణాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీలకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని అన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ లు శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం లాబరేటరీలకు పంపించాలని సూచించారు. చట్టం ప్రతిఫలాలు ప్రజలకు అందేవిధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని, నోడల్ అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలో పౌష్టికాహారం క్రింద అందించే ఇప్ప పువ్వు లడ్డు సంప్రదాయ బద్దమైన, పౌష్టికారమైన ఆహారం అని అభినందించారు. కమిషన్ సభ్యులు కే.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో అంగన్వాడీ ల పని తీరు బాగుందని, సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు మరింత కృషి చేయాలనీ సూచించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఆహార భద్రత పథకాన్ని అర్హులైన లబ్దిదారులకు అందేలా జిల్లా యంత్రాంగం పని చేస్తుందని, జిల్లా లోని చిట్టచివరి పేద వాడికి చట్ట ప్రకారం పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సూచించిన మేరకు ఆ సంబంధిత అధికారులు సమర్థవంతంగా పని చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ITDA ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ, జీసీసీ ల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నామని తెలిపారు. గిరిజనులకు పౌష్టికాహారం కలిగిన సంప్రదాయ ఇప్ప పువ్వు లడ్డును అందించి రక్త హీనత నుండి కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ITDA పరిధి లోని పాఠశాలల్లో వసతి గృహాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై కమిషన్ కు వివరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు వివరిస్తామని, చట్టం గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, విజిలెన్స్ కమిటీలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఆయా ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించి వివరంగా తెలియపరుస్తమని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, DRDO కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా విద్య శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post