ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగానిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగానిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలు మే-6 నుండి 19 వరకు, మే -23 నుండి జూన్ ఒకటి వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో (156) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంటర్ మొదటి సంవత్సరం 59,694 మంది, ఇంటర్ రెండవ సంవత్సరం 55,672 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అలాగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు (283 ) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 47 వేల 540 మంది రెగ్యులర్ విద్యార్థులు, 44 మంది సప్లమెంటరీ విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని, పరీక్షా కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని, పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శాఖ టీమ్ ను ఏర్పాటు చేసి ఓ.ఆర్.ఎస్.పాకెట్ లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని అలాగే పరిసర ప్రాంతంలో గల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులు వచ్చే సమయంలో చెకింగ్ నిమిత్తం సిబ్బందిని ఏర్పాటు చేయాలని తెలిపారు. పరీక్షా హాలులో అనుమతించని, అనుమతించే వాటిపై, సమయపాలన పై విద్యార్థులకు ముందుగా సమాచారం అందించాలని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేయాలని, విద్యా శాఖ, సంబంధిత అధికారులతో పరీక్షా సమయం విషయం సమన్వయం చేసుకొని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ప్రశ్న పత్రాలను పోలీసు బందోబస్తుతో పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, సెంటర్ కు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సి.సి. కెమెరాలను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా వైద్య అధికారి స్వరాజ్య లక్ష్మి, సైబరబాద్ కమిషనరేట్ డి.సి.పి.శిల్పవల్లి, ఏ.సి.పి.శంకర్, డి.ఎం.అండ్ హెచ్.ఓ.డాక్టర్ స్వరాజ్య లక్ష్మి,జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి వెంక్య నాయక్, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా ట్రేజరీ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ తహసీల్దార్ జయశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post