పత్రిక ప్రకటన
తేదీ : 28–04–2022
- ఇంటర్మీడియట్, పదో తరతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు
- వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
- మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ హరీశ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్, కమిషనర్ శ్రీదేవసేనలు ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని పరీక్షల సమయం మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతో పాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్తో అందుబాటులో ఉంచాలని అలాగే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నందున ముందుగానే ఆయా కేంద్రాల వద్ద వైద్య సదుపాయాలతో పాటు రవాణా సౌకర్యాలు కల్పించాలని మంత్రి కలెక్టర్లు, డీఈవోలను ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ముందుగానే ఏర్పాట్లు చేయాలని విద్యార్థులకు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పించాలని వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. అలాగే విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా అవసరాలు ఉంటే 1800-599-9333 టోల్ ఫ్రీ నెంబర్నుకు ఫోన్ చేయాలని వివరించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్ష కేంద్రాలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, విద్యుత్తు తదితర అంశాలపై ఇదివరకే సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు అందచేశామని వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేపట్టామని దీనికై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ హరీశ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కి తెలిపినారు. జిల్లాలో 127 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు, 251 పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్తు సరఫరా, వైద్య సౌకర్యం సమకూర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకొన్నట్లు కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్లో తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లకు రూట్మ్యాప్ తయారు చేయడం జరిగిందని అధికారులు నిర్వహించాల్సిన విధులను కూడా ఇప్పటికే నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివరంగా తెలియజేశామని కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన విధులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించామని పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పకడ్భందీ ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా అందుబాటులో వుంచుతాము అని తెలిపినారు. అలాగే ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా బస్సులు నడపాలని తెలియజేయడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించామని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ కొరకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని అమలుపరుస్తున్నామని కలెక్టర్ హరీశ్ మంత్రి, అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాచకొండ, సైబరాబాద్ డీసీపీలు రక్షితామూర్తి, సందీప్ ,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి కిషన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ కుషాయిగూడ అధికారి సుధాకర్, పోస్టల్ డిపార్ట్మెంట్తో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.