ఇంటర్మీడియట్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు – జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

ఇంటర్మీడియట్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు – జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

ఈ నెల 25 నుండి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఎలాంటి గ్యాప్ లేకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు సంసిద్ధులు కావలసినదిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం హైదరాబద్ నుండి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ జీవితంలో ఒక మలుపుకు నాంది అని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా తరువాత మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నందున కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయవలసినదిగా కలెక్టర్లకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫర్నీచర్ సరిపోకపోతే అద్దెకు తీసుకోవాలని, ప్రతి రోజు శానిటైజ్ చేయాలని, మాస్కులు, శానిటైజర్ లు,ధర్మల్ స్క్రీనింగ్, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని, జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక గది కేటాయించాలని మంత్రి సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని, ఒక గంట ముందే పరీక్షా కేంద్రాలకు వచ్చేలా బస్సులు షెడ్యూల్ చేయాలని సూచించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసివేయించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మేడ్చల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనగా ఇక్కడి నుండి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు పరీక్షలకు హాజరవుతున్న 7,211 మంది విద్యార్థిని విద్యార్థులు కోసం 34 కేంద్రాలు ఏర్పాటు చేసి సి.సి. కెమెరాలు అమర్చామని మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. కేంద్రాలను పరీక్షకు ముందు, తరువాత ప్రతి రోజు శానిటైజ్ చేయుటకు, ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచుటకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, మంచి నీరు ఏర్పాటుతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సౌకర్యం, ప్రథమ చికిత్స, అంబులెన్స్, ప్రతి కేంద్రం వద్ద పొలిసు బందోబస్త్, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేతకు చర్యలు తీసుకున్నామని ఆమె మంత్రికి వివరించారు. 13 పోలీస్ స్టేషన్ లలో పరీక్ష పత్రాలను భద్రపరచుటకు తగు ఏర్పాటు చేశామన్నారు. విదార్థులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, శానిటైజర్, మంచి నీళ్ల బాటిల్ తో ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు రావలసినదిగా సూచించామని ఆమె మంత్రికి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖా ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, కమీషనర్ సైడ్ అహ్మద్ జలీల్ ,అడిషనల్ ఎస్పీ కృష్ణ మూర్తి, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, పోస్టాఫీసు సూపరింటెండెంట్, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post