ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి  – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్

ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. ఈ నెల 6 నుండి 21 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న 13,777 మంది విద్యార్థుల కోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 9 నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8 .15 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, చరవాణిలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కూడుకున్నదని ,ఏ చిన్న పొరపాటు జరిగిన మూల్యం చెల్లించకతప్పదని, కాబట్టి లైన్ డిపార్టుమెట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ ప్రాంతాలలో పర్యవేక్షించుటకు 5 మంది సభ్యులతో కస్టడీయన్ లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. నాలుగు రూట్ల ద్వారా 13 పోలీస్ స్టేషన్లలో భద్రపరచిన ప్రశ్నపత్రాలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలించుటకు, పరీక్షా అనంతరం వెంటనే 11 పోస్టాఫీసు ల ద్వారా సంగారెడ్డి కి స్పీడ్ పోస్ట్ చేయుటకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నిఘా ఉంచుటకు సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఒక ఫ్లైయింగ్ బృందం అల్లాదుర్గ్, టేక్మాల్, పెద్ద శంకరంపేట్ రూట్ లో ప్రతి రోజు కేంద్రాలను తనిఖీ చేయాలని, ఆర్.డి.ఓ.లు కూడా ర్యాండమ్ గా ప్రతి రోజు పరీక్ష కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.
పరీక్షల నిర్వహణ ఏర్పాట్లప్లై ఇప్పటికే లైన్ డిపార్ట్మెంట్స్ అయిన విద్య, వైద్య, రెవిన్యూ, పొలిసు, విద్యుత్, ఆర్.టి.సి. పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీచేశామని అన్నారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడపడం జరుగుతుందని , పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రంలో మంచి నీటి సదుపాయంతో పాటు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ప్రధమ చికిత్సకై వైద్య సిబ్బందిని, 10 అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు తో పాటు రెవిన్యూ శాఖ ద్వారా 144 సెక్షన్ ను అమలుచేస్తున్నామని, జిరాక్స్ కేంద్రాలు మూసి వేస్తున్నామని అన్నారు. సునిశిత పరీక్షా కేంద్రాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలసినదిగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సత్యనారాయణ, డిఎస్పీ సైదులు, ఆర్.డి.ఓ. సాయి రామ్, డిఎమ్ అండ్ హెచో వెంకటకేశ్వర్ రావు, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post