ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని, నర్సరీలను సందర్శించిన -అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ బుధవారం నాడు కుల్చారం లోని ప్రభుత్వ జూనియర్ కళాళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా చిల్పిచెడ్ మండలం చిట్కుల్ లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీలను, మన ఊరు మన బడి క్రింద ఎంపిక చేసిన పాఠశాలతో పాటు బద్రియ తండా, గౌతాపూర్, గన్యా తండా గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 7,450 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 6,968 మంది హాజరయ్యారని, 482 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మొత్తంగా 93 .53 శాతం విద్యార్థుల హాజరు శాతం నమోదయ్యిందని తెలిపారు. ఇందులో 6,374 మంది జనరల్ విద్యార్థులు కాగా 594 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారని, మొత్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని ప్రతిమ సింగ్ స్పష్టం చేసారు.
కాగా ఈ వానాకాలంలో జిల్లాలో 34 లక్షల 42 వేల మొక్కలు నాటాలనే లక్ష్యానికనుగుణంగా జిల్లాలోని వివిధ నర్సరీలలో పెంచుతున్న మొక్కల తాజా స్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నానని అందులో భాగంగా చిట్కుల్ లో నర్సరీలు, ప్రకృతి వనాలను సందర్శించానని అదనపు కలెక్టర్ తెలిపారు. నర్సరీలలో మొక్కల జర్మినేషన్ ఉండేలా చూడాలని, మొక్క చుట్టూ పాదులు తీసి నీళ్లు పారించాలన్నారు. రోడ్డు కిరువైపులా నాటుటకు పెద్ద మొక్కలు సిద్ధం చేయాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖచ్చితమైన అంచనాలు రూపొందించి పరిపాలన ఆమోదం పొంది పాఠశాలలు తెరిచేలోగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏం.పి .డి.ఓ. తదితర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share This Post