ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు:: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

జనగామ, అక్టోబర్ 21: ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ సయ్యద్ అహ్మద్ జలీల్ లతో కలిసి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్దంగా ఉండాలని, పరీక్షలు నిర్వహించే కేంద్రాలను శుభ్రం చేయించాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ జీవితంలో ఒక మలుపుకు నాంది అని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా తరువాత మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నందున కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయవలసినదిగా కలెక్టర్లకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫర్నీచర్ ఉండేలా చూసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాలు ప్రతి రోజు శానిటైజ్ చేయాలని, మాస్కులు, శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని, జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక గది కేటాయించాలని వైద్య అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలుచేయాలని, చుట్టూ ఉండే జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ అధికారులకు ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు, పరీక్షలకు 4 వేల 986 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరవనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచుటకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపర్డెంట్టెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, మంచి నీరు ఏర్పాటుతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సౌకర్యం, ప్రథమ చికిత్స, అంబులెన్స్, ప్రతి కేంద్రం వద్ద పొలిసు బందోబస్త్, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేతకు చర్యలు తీసుకున్నామని మంత్రికి వివరించారు. విదార్థులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, శానిటైజర్ తో ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు రావలసినదిగా సూచించామని మంత్రికి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యుటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి బైరి శ్రీనివాస్, ఎన్పిడిసిఎల్ ఎస్.ఈ మల్లికార్జున్, డిఈఓ కె. రాము . పోస్టు మాస్టర్ ప్రసాద్ బాబు, పరీక్షల పర్యవేక్షణ కమిటీ సభ్యుడు విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post