ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ నగరంలోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీయగా, 394 మందికి గాను మంగళవారం నాటి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టు పరీక్షకు 386 మంది హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ కె.రోజారాణి తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీసీ ఫుటేజీని పరిశీలిస్తూ, ప్రశ్న పత్రాల బండిళ్లను నిర్ణీత సమయానికే తెరిచారా, నిబంధనలను పాటించారా లేదా అన్న అంశాలను గమనించారు. సీ సీ కెమెరా లో స్వల్ప లోపాలను గమనించి, వాటిని సరి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తుండడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
—————————

Share This Post