ఇంటింటా ఇన్నోవేటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం

ఇంటింటా ఇన్నోవేటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం

ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తున్నదని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో విద్య, వ్యవసాయ, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, ఐ.టి.ఐ., ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వేదిక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నదని అన్నారు. ప్రజలలో దాగి ఉన్న ప్రతిభకు రూపం ఇచ్చేలా వారిని ప్రోత్సహించుటకు ప్రభుత్వం 2019-20 నుండి ఇన్నోవేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. ఇందులో పాఠశాల,కళాశాల విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వ్యవసాయదారులు, గృహిణులు ఇలా ఏ రంగానికి చెందిన వారైనా తమలో వచ్చిన కొత్త ఆలోచనలకు పదును పెట్టి సృజనాత్మకను జోడించి చేసిన ఆవిష్కరణలను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని అన్నారు. ప్రధానంగా గ్రామీణా ప్రాంతాల నుండి చాలా మంది ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలు ప్రదర్శించడానికి ఇది చక్కటి అవకాశమని అన్నారు.
ప్రస్తుత కరోనా నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్ లైన్ వేదికగా నూతన ఆవిష్కరణలు ప్రదర్శించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసి జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ఆవిష్కరణలు వెళ్లేలా కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఆయా అధికారులను కోరారు. ఆవిష్కర్తలు ఈ నెల 10 లోగా ఆన్ లైన్ లో తమ ఆవిష్కరణలు పంపాలని కోరగా ఇప్పటి వరకు కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, అవి రెండు కూడా మొదటి స్థాయిలో ఎంపికై రెండవ దశలో ఉన్నాయని అన్నారు. కాబట్టి ఆవిష్కర్తలు ఈ నెల 10 లోగా తమ ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరును విధిగా పేర్కొంటూ నిర్ణీత గడువులోగా 9100678543 కి వాట్స్ ఆప్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఆవిష్కరణలను రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ల్ పరిశీలించి ఉత్తమమైన ఐదు ఆవిష్కరణలను ఎంపిక చేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజున వాటిని ఆన్ లైన్ లో ప్రదర్శిస్తారని అన్నారు. ఇందులో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలు కూడా అందిస్తారని రమేష్ తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మొబైల్ నెంబర్ 832859915 కు సంప్రదించవలసినదిగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రమా జిల్లా మేనేజర్ కృష్ణ మూర్తి, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, డి.పి .ఆర్.ఓ. శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post