ఇంటింటి ఆరోగ్యం సర్వే నిర్వహించాలని, వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ -రాష్ట్ర ఆర్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ఇంటింటి ఆరోగ్యం సర్వే నిర్వహించాలని, వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనీ రాష్ట్ర ఆర్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు, వైద్య అధికారులకు సూచించారు.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో, జిల్లా వైద్య అధికారులతో రాష్ట్ర ఆర్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మన రాష్ట్రంలో నిర్వహించిన ఫీవర్ సర్వే ద్వారా మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి తెలిపారు. ఇంటింటా ఆరోగ్యం పేరుతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేసి వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు.
వంద శాతం మొదటి డోస్, 77 శాతం రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, ప్రతి జిల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలన్నారు.15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. శాఖల వారీగా ఫ్రంట్ లైన్ సిబ్బంది బూస్టర్ డోస్ వేసుకునే విధంగా చూడాలన్నారు. కోవిడ్ సంభందిత కిట్స్, మందుల కొరత లేదని, వెంటనే అవసరమైన మేర కిట్లను జిల్లాలకు అందజేస్తామని, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ప్రణాళిక బద్దంగా డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేసి, అవసరమైన వారికి హోం ఐసొలేషన్ కిట్స్ అందజేయాలన్నారు. ఎక్కడైనా కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భంలో ఆక్సిజన్, రేమిదిస్సుర్ లభ్యత, పని తీరు రివ్యూ చేసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. డోర్ టు డోర్ సర్వే లో హెల్త్ వర్కర్స్ తో పాటు పంచాయతీ రాజ్, మునిసిపల్ సిబ్బంది తో టీమ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్లి అందరితో మాట్లాడి ఏమైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే హోం ఐసొలేషన్ కిట్స్ అందించాలని, ప్రతిరోజూ మానిటరింగ్ చేసి వారిలో ధైర్యం కల్పించాలని మంత్రి హరిష్ రావు పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ లో వ్యాధి లక్షణాలు తగ్గనివారిని అవసరం మేరకు సమీప, ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్ గా సేవలు అందించడంతో పాటు క్వాలిటీ డైట్ అందించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తూ కేసులు తగ్గించాలన్నారు.
పోలీస్ శాఖ సమన్వయంతో ప్రజలు గుమికూడకుండా చూడాలని, ప్రతి వ్యక్తి మాస్క్ ధరించే విధంగా, కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు కేటాయించాలని, మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానలు కోవిడ్ తగ్గేవరకు ప్రతి ఆదివారం కూడా పనిచేసే విధంగా చూడాలన్నారు. బస్తీ దావాఖనలలో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించాలన్నారు.
రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించు ఎగ్జి గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎగ్జి గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నవని అన్నారు. మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండవ డోస్ వాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయుటకు చర్యలు చేపడుతున్నామని, జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు అన్నిపీ.హెచ్.సిలు, కమ్యూనిటీ, ఏరియా ఆసుపత్రుల్లోనూ కొవిడ్ తో ఇబ్బంది పడుతున్న వారికి తగిన చికిత్సలు అందించడం జరుగుతోందని తెలిపారు. ఇంటింటికి ఆరోగ్యం పేరుతో ఇంటింటి జ్వర సర్వే చేపట్టి, కొవిడ్ లక్షణాలు కలిగి ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేస్తామని, ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, కోవిడ్ కేర్ సెంటర్ ను అందుబాటులో ఉంచుతామని, 15 -17 సంవత్సరం లోపు వయసు ఉన్న పిల్లలకు ఇప్పటి వరకు 63,051 మందికి టీకాలు ఇవ్వడం జరిగిందని, తమరి సూచనలను అనుసరించి ప్రజలకు సరియైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రికి కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post