ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల జాబితా ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ నుండి వ్యవసాయ, రెవిన్యూ, అటవీశాఖ అధికారులతో పంటలు నష్టం, అటవీ రెవిన్యూ భూములు రీ కన్సలేషన్, ధరణి, రేషన్ బియ్యం పంపిణీ, రెండు పడక గదులు ఇండ్లు, ధృవీకరణ పత్రాలు జారీ, కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు ద్వారా ఆర్థిక సాయం అందించుట,  ఓటరు జాబితాలో అభ్యంతరాలు పరిశీలన, నూతన ఓటరు నమోదు ప్రక్రియ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయు విదంగా రైతులకు  ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు అన్ని వ్యవసాయ క్లస్టర్లులోని రైతు వేడుకల్లో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల   597 మంది రైతులకు చెందిన 130 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పరిహారం కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపేందుకు సిద్ధం చేయాలని చెప్పారు. 74 ఇండ్లు పాక్షికంగాను, 4 ఇండ్లు పూర్తిగాను. దెబ్బతిన్నాయని, మరణించిన ఇద్దరు వ్యక్తులకు, మూడు పశువులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దారులను ఆదేశించారు. అటవీ రెవిన్యూ భూములు రీ కన్సలేషన్ ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అటవీ, తహసిల్దారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 9.50 లక్షల ఎకరాలు రీ కన్సిల్ చేయడం జరిగిందని, మిగిలిన 62 వేల ఎకరాలు రీ కన్సిల్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పారు. రెండు పడక గదుల ఇండ్లను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, తహసిల్దారులు, కాంట్రాక్టర్లు సంయుక్తంగా పరిశీలన చేసి ధృవీకరణతో నివేదికలు అందచేయాలని చెప్పారు. ఇండ్లు నిర్మాణాలకు సంబంధించి పూర్తి చేయు ప్రక్రియపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. నిర్మాణాల్లో నిర్లక్ష్యంగా వహించే కాంట్రాక్టర్లుకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాల్లో అధికారులు వాస్తవ నివేదికలు అందచేయాలని, అసంబద్ద నివేదికలు ఇవ్వొద్దని చెప్పారు. నిర్మాణ దశలపై నోట్ క్యామ్ యాప్ ద్వారా  జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. నిర్దేశించిన గడువులోగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకపోవడం వల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దమ్మపేట పామాయిల్ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ నుండి పామాయిల్ గెలలు రాకుండా బోర్డర్లో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. చెక్ పోస్టులు ఏర్పాటుతో పాటు తహసిల్దారులు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. మన ప్రాంత గెలలు ఆంధ్రాకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పామాయిల్ పంటకు ఇక్కడ రాయితీలు  తీసుకుంటూ పంటను ఇతర రాష్ట్రాల్లో విక్రయించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు కొరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ నాటికి పరిష్కరించాలని తహసిల్దారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలు మార్పు, కొత్తవి ఏర్పాటు, ఓటరు జాబితా తయారు, మార్పులు, చేర్పులు అంశాలపై మండలస్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. శిధిలావస్థలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యాయంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని  చెప్పారు. సాదాబైనామాకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజుల్లో పరిష్కరించాలని చెప్పారు. రేషన్ షాపులు ద్వారా పంపిణీ చేయుచున్న బియ్యం నల్ల బజారుకు తరలకుండా గ్రామస్థాయి నుండి పటిష్ట పర్యవేక్షణ జరగాలని చెప్పారు. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇదే స్పూర్తితో మన జిల్లాను నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన జిల్లాగా ప్రకటించుటకు  చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తహసిల్దారుల సేవలు అభినందనీయమని చెప్పారు. నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన గ్రామాలను, మండలాలను సగర్వంగా ప్రకటించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోకచక్రవర్తి, డిఎసీ చంద్రప్రకాశ్, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయశాఖ ఏడీ రవికుమార్, ఎఫ్డిఓ అప్పయ్య, ఆర్డిఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post