ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం జిల్లా పర్యటన : అభివృద్ధి పనుల తనిఖీ

జనగామ, అక్టోబర్ 11: జాతీయ స్థాయిలో చేపడుతున్న అభివృద్ధి పనుల తనిఖీకి జిల్లాకు వచ్చిన ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్యతో సమావేశమై తమ పర్యటన వివరాలు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా వారు, ఈ నెల 5 నుండి జిల్లాలో పర్యటించినట్లు, తమ పర్యటనలో ఉపాధి హామీ, సెర్ప్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన మున్నగు కేంద్ర పథకాలలో సాధించిన ప్రగతిని తనిఖీ చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో 7 రిజిస్టర్లు, నగదు పుస్తకం, తీర్మానాల రిజిస్టర్లను పరిశీలించామన్నారు. కేంద్రం ద్వారా 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో మంజూరు నిధులు, ఖర్చుల వివరాలు తనిఖీలు చేసినట్లు వారు తెలిపారు. తమ పర్యటనలో జనగామ మండలం వెంకీర్యాల, పెద్దపహాడ్, పెద్దరాంచెర్ల, లింగాలఘనపూర్ మండలం పటేల్ గూడెం, నవాబ్ పేట, వడిచెర్ల, రఘునాధపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం, కంచన్ పల్లి, గబ్బేట గ్రామాల్లో తనిఖీలు చేశామన్నారు. తనిఖీల సందర్భంలో ఉపాధి హామీ కూలీలతో క్షేత్రస్థాయిలో అందుతున్న కూలీ గురించి, సరిగా అందుతున్నది లేనిది పరిశీలించినట్లు తెలిపారు. 14 వ ఆర్థిక సంఘం గురించి ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (సంస్థలు) అబ్దుల్ హామీద్, కేంద్ర కమిటి సభ్యులు బెంజ్, ఆషన్, డిఆర్డీవో జి. రాంరెడ్డి, హౌజింగ్ ఇఇ దామోదర్ రావు, ఎపిడి కొండల్ రెడ్డి, డిపిఎం సమ్మక్క, సిటీఏ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post