ఇప్పటికే 75లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు..
శుక్రవారం కేసీఆర్ జాతరకు వస్తారు హెలికాఫ్టర్ ద్వారా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దయాకర్ రావు
మేడారం, ఫిబ్రవరి 17 :
ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే మేడారం జాతరలో గద్దెపై సారలమ్మ ప్రతిష్ఠించకముందే దాదాపు 75 లక్షల మంది భక్తులు మేడారం ఆలయాన్ని దర్శించుకున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం మేడారంలో తెలిపారు. డిసెంబర్ నుంచి జాతర ప్రారంభానికి ముందు వరకు 50లక్షల మంది వరకు భక్తుల దర్శనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. దేశంలోనే కుంభమేళా తర్వాత జరిగే రెండో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. జాతరలో గద్దెపైకి సారక్క రాకముందే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 50 లక్షలు కాగా, జాతర ప్రారంభం అయ్యాక 75 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని దయాకర్‌రావు తెలిపారు. బందోబస్త్ కోసం ఏటా పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. గిరిజనుల అమ్మవారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం మేడారం రానున్నారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం వరకు మేడారంలో ఉండనున్నందున ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
మేడారం జాతర ఏర్పాట్లు, భక్తుల రాకను పరిశీలించడానికి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జాతరలో ఏర్పాట్లను మంత్రి 50 కిలోమీటర్ల మేర విహంగ వీక్షణం చేశారు. గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) ద్వారా జాతర కోసం తమ శాఖ ద్వారా రూ. 10 కోట్లు వెచ్చిస్తున్నామని, మేడారం వచ్చే యాత్రికుల ప్రయోజనం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులతోనూ మాట్లాడారు. ఈ పర్యటనలో మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ ఉషాదయాకర్‌రావు ఆయన వెంట ఉన్నారు.
మేడారం జాతరలో పారిశుద్ద్య పనులను మంత్రి దయాకర్ రావు తనిఖీ చేశారు. పారిశుద్ద్యాన్ని సరిగా పాటించని వారికి ఫైన్ విధించారు. అందరు పారిశుద్యాన్ని జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, భక్తులు, వ్యాపారులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు.