ఇల్లంతకుంట మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వ్యాక్సినేషన్ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల క్షేత్ర స్థాయిలో పరిశీలన

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 2: ఇల్లంతకుంట మండలంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి పర్యటించారు. మొదటగా అనంతారం గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ వ్యాక్సిన్ తీసుకొనని జాబితా నుండి వారిని సమీకరించి, వ్యాక్సిన్ తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండో డోస్ డ్యూ ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ, ధాన్యాన్ని మిల్లులకు తరలించే తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తదనంతరం ముస్కానిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. అనంతరం పత్తికుంటపల్లి గ్రామ పంచాయితీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తదనంతరం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతమందికి మొదటి, రెండవ డోస్ వ్యాక్సిన్ వేశారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మొదటి డోస్ గడువు ముగిసి, రెండవ డోస్ కు అర్హులైన వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు ఎన్ని ప్రసవాలు చేశారని సంబంధిత వైద్యులను అడిగారు. అలాగే టీబీ, డెంగ్యూ కేసుల వివరాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చివరగా ఓబులాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్శనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post