ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
————————————
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వెంకటాపూర్, ఆవునూర్, మల్లారం, మామిడిపల్లి, కనగర్తి, బావుసాయిపేట శివార్లలో ఉన్న క్వారీలను స్థానిక అవసరాలు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు సమీపంలో గల మండలాలకు తరలించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తహశీల్దార్లు హోలో గ్రామ్ తో కూడిన వే బిల్లులను జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు జీపీఎస్ అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలించాలని సబ్ కమిటీ కి కలెక్టర్ సూచించారు. వే బిల్లులు జారీ చేయడంలో జాప్యం చేయకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ఇంఛార్జి డీఆర్ఓ టి. శ్రీనివాస్ రావు, మైన్స్ ఏడీ సైదులు, టీఎస్ఎండీసీ ప్రాజెక్ట్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, డీపీఓ రవీందర్, భూగర్భ జల శాఖ అధికారి నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.