ఈ నెల 10వ తేదీన జరుగనున్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డా|| శశాంకగోయల్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు 08, ఖమ్మం:

ఈ నెల 10వ తేదీన జరుగనున్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డా|| శశాంకగోయల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీన జరుగనున్న పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసుకొని సంసిద్ధంగా ఉండాలని, పూర్తి పారదర్శకతతో ఎన్నికల ప్రవర్తన నియమావళీని ఖచ్చితంగా అమలు చేస్తూ పోలింగ్ జరిగేలా పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టాలని సూచించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు, వినియోగించని బ్యాలెట్ పేపర్లు. ఇతర పోలింగ్ సామాగ్రిని, పటిష్ట బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలన్నారు. పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలలో కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, మాస్క్ లు, పానిటైజర్, ధర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచడంతో పాటు, భౌతిక దూరం పాటించేలా తగు ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు, పోలీసు అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక సీనియర్ పోలీసు అధికారిని కేటాయించాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎటువంటి వస్తువులను అనుమతించరాదని, పోలింగ్ ప్రక్రియ వెబ్‌కాస్టింగ్ చేయాలన్నారు. ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని ఎన్నికల సంఘంచే పంపిణీ చేయబడిన వాయిలెట్ పెన్నుతో నెంబర్లను ప్రాధాన్యత క్రమంలో సూచిస్తూ ఓటుహక్కు వినియోగించుకునేలా ఓటర్లకు తెలియచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్, అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూదన్, ఏ.సి.పి ప్రసన్నకుమార్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Share This Post