ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 305 మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల పరిశీలకులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు.

బుధవారం కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 9 మంది జడ్పీటిసిలు, 75 మంది యంపిటిసిలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వీరిలో 34 మంది పురుషులు, 50 మంది మహిళలున్నట్లు చెప్పారు. కొత్తగూడెం ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 60 మంది కౌన్సిలర్లు, 14 మంది జడ్పీటిసిలు, 145 మంది యంపిటిసిలు, ఇద్దరు ఎక్స్ ఆఫీషియో సభ్యులు మొత్తం 221 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వీరిలో 86 మంది పురుషులు, 135 మంది మహిళలున్నారని చెప్పారు. ఈ రెండు పోలింగ్.. కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు, చేయాల్సినవి, చేయకూడని వాటి సమాచారం ఏర్పాటు చేయాలని చెప్పారు. సెక్టోరియల్ అధికారులుగా భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీఓలు వ్యవహరిస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు తదితర అంశాల గురించి సెక్టోరియల్ అధికారులతో చర్చించారు. నేటి (బుధవారం) నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాల నిలుపుదలపై మండలస్థాయిలో తహసిల్దారులు, ఎక్సైజ్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఓటుహక్కు వినియోగంలో ఓటర్లు పోలింగ్ కేంద్రం సిబ్బంది ఇచ్చిన పెన్నును మాత్రమే వినియోగించి పోటీ చేస్తున్న అభ్యరుదలకు ఎదురుగా ప్రాధాన్యతా క్రమంలో నెంబర్లు వేయాలని, టిక్స్ కానీ, వ్రాయడం కానీ చేసిన అటువంటి ఓటు చెల్లుబాటు కాదని చెప్పారు. ఓటుహక్కు -వినియోగం పూర్తిగా రహస్యమని, వినియోగాన్ని బట్టబయలు చేయడం ఎన్నికల సంఘం ఉత్తర్వులు ప్రకారం నిషేదమని చెప్పారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని చెప్పారు. ఓటు హక్కు వినియోగంలో ఓటర్ల పోలింగ్ కేంద్రంలోనికి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లొద్దని వారు సూచించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు దూరంలో బారికేండింగ్ ఏర్పాటు చేయాలని, ఓటర్లును తప్ప ఎవరినీ అనుమతించరని చెప్పారు. ఉయదం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కౌన్సిలర్లును, జడ్పీటిసిలను, యంపిటిసిలను గుర్తించడానికి వీలుగా మున్సిపల్ కౌన్సిలర్లు, యంపిడిఓలకు విధులు కేటాయించినట్లు చెప్పారు. పోలింగ్ మెటీరియల్ తీసుకోవడంలోను, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తదుపరి ఖమ్మం రిసెప్షన్ సెంటర్లో అప్పగించే వరకు పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. మెటీరియల్ అప్పగించిన తదుపరి చెల్లిస్టు ఆధారంగా అన్ని సక్రమంగా ఉన్నట్లు ధృవీకరణ జరిగిన తదుపరి మాత్రమే వెళ్లాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు మెసేజ్లు కానీ, ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహణతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ప్రచారం నిర్వహించరాదని వారు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత, డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, జడ్పీ సిఈఓ విద్యాలత, ఎన్నికల విభాగపు పర్యవేక్షకులు రాజు, తహసిల్దారులు రామక్రిష్ణ, క్రిష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post