పత్రికా ప్రకటన తేది:17.8.2022, వనపర్తి.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 21వ. తేదిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నేలంతా పులకరించేలా మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుండి స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై అటవీ శాఖ స్పెషల్ సీ.ఎస్. శాంతకుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 21వ. తేదిన రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
8వ విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 264 కోట్లకు పైగా మొక్కలు నాటటం జరిగిందని ఆయన తెలిపారు. 8వ విడత హరితహారం కార్యక్రమంలో లక్ష్యానికి చేరువగా మొక్కలు నాటడం జరిగింది, వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష్యానికి మరింత చేరువ అయ్యేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో పని చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో పచ్చదనం శాతం 7.7 వృద్దిచెందిదని మంత్రి వివరించారు. ఆగస్టు 21వ. తేదిన ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డులలో మొక్కలు నాటాలని, అందుకు అవసరమైన మొక్కలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీలలో నాటిన మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ పథకం కింద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ 8వ విడత హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటి వరకు మూడు వంతుల పనులు పూర్తి చేశామని ఆమె తెలిపారు. ఆగస్టు 21వ. తేదిన అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆమె సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీ స్థలాలలో, గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీల పరిధిలో అనువైన స్థలాన్ని గుర్తించి, మొక్కలు నాటేందుకు బృందాలను ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్, అటవీశాఖ అధికారి రామకృష్ణ, డి ఆర్ డి ఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, పంచాయతీ రాజ్ ఈ.ఈ. మల్లయ్య, ఆర్ అండ్ బి ఈ.ఈ. దేశ్య నాయక్, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, వనపర్తి, పెబ్బేర్, అమరచింత, కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…..
పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.