ఈ నెల 25న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్న భారత వైద్య మండలి బృందం, వెంటనే అదనపు పడకల నిర్మాణ పనులు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఈనెల 25వ తేదీ నుండి ఎప్పుడైనా ఆకస్మికంగా జాతీయ వైద్య మండలి కమిషన్ సభ్యులు పర్యటించవచ్చునని, ఈ మేరకు ఈనెల 25వ తేదీలోగా అన్ని సదుపాయాలతో అదనపు బెడ్ ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు.
సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు.
జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 330 పడకల ఆసుపత్రి ఉండేందుకు ప్రస్తుత ఆసుపత్రికి అదనపు గదుల నిర్మాణం, ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. వీటిని పరిశీలించిన కలెక్టర్ ఈనెల 25వ తేదీ నుండి ఏ క్షణమైనా ఆకస్మికంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భారత వైద్య మండలి కమిషన్ సభ్యులు పర్యటించే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులను కలెక్టర్ ఆదేశించారు.
భారత వైద్య మండలి(ఎంసీఐ) బృందం సందర్శించే లోగా ప్రభుత్వ ఆసుపత్రి లోని వివిధ విభాగాల్లో సౌకర్యాలను నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆసుపత్రిలో అవసరమైన ప్రయోగశాలలు, ఆపరేషన్ గదులు, విభాగాల వారీగా ఏర్పాటు చేయనున్న గదులను కలెక్టర్ పరిశీలించారు.
కళాశాల టీచింగ్ ఆసుపత్రిలో ఉన్న ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది గురించి కలెక్టర్ ఆరా తీశారు.
ఎంసీఐ బృందం తనిఖీ సమయంలో సరైన మౌలిక సదుపాయాలను తనిఖీకి వచ్చిన ఎంసీఐ బృందం సంతృప్తి వ్యక్తం చేసేలా ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తనిఖీకి వచ్చే ఈ బృందం సభ్యులు ఇచ్చే నివేదిక ఆధారంగానే ఈ ఏడాది ఎంబిబిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసీఐ అనుమతి జారీ చేయడం జరుగుతుందన్నారు. ఎంసీఐ బృందం తనిఖీ సందర్భంగా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా కలెక్టర్ ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ప్రసూతి వార్డుకు కావాల్సిన పడకలు, ఇతర సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్ వసతులు తదితర అన్ని వసతులు ఎలా ఉండాలో సూచించి చేయించుకోవాలని అన్నారు. అన్ని వార్డులు, కొత్తగా నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ మను చౌదరి,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రఘు, ప్రొఫెసర్ ఆర్ యం ఓ డాక్టర్ నరహరి, డి సి హెచ్ డాక్టర్ రమేష్, డాక్టర్ రోహిత్ డాక్టర్ కోటేశ్వర్ కాంట్రాక్టర్ నాసర్,ఇతర డాక్టర్లు, ఇంజనీర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.