ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

గురువారం హైదరాబాద్ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్దంగా ఉండాలని, పరీక్షలు నిర్వహించే కేంద్రాలను శుభ్రం చేయించాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి అని అన్నారు.
విద్యార్థులకు ఇంటర్మీడియట్ జీవితంలో ఒక  మలుపుకు నాంది అని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా  తరువాత మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నందున  కోవిడ్  ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయవలసినదిగా కలెక్టర్లకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు  కల్పించాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని,  ఫర్నీచర్ ఉండేలా చూసుకోవాలి అని అన్నారు.  ప్రతి రోజు శానిటైజ్ చేయాలని,  మాస్కులు,  శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్,  ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని, జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక గది కేటాయించాలని వైద్య అధికారులకు మంత్రి సూచించారు.
విద్యార్థులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావద్దని సూచించారు.  పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని,  విద్యుత్ అధికారులకు ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి అని, పరీక్షలకు 16 వేల 854 మంది విద్యార్థినీ, విద్యార్థులు  హాజరవుతారని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని  పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో  సన్నాహక  సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి  తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్, మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో  ఉంచుటకు  చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు.  అన్ని కేంద్రాలకు చీఫ్ సూపెరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, మంచి నీరు ఏర్పాటుతో  పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చూడవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు  సమయానుకూలంగా బస్సు సౌకర్యం, ప్రథమ చికిత్స, అంబులెన్స్, ప్రతి కేంద్రం వద్ద పొలిసు బందోబస్త్, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేతకు చర్యలు తీసుకున్నామని మంత్రికి వివరించారు.  విదార్థులు కూడా  కోవిడ్  నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి, శానిటైజర్ తో ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు రావలసినదిగా సూచించామని మంత్రికి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖా ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ సయ్యద్ అహ్మద్ జలీల్ ,  నల్గొండ జిల్లా నుండి ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్, జిల్లా ఎగ్జామి నేషన్ కమిటీ సభ్యులు ఎం.డి.ఇస్మాయిల్,హై పవర్ కమిటీ సభ్యులు సి.హెచ్.మల్లా రెడ్డి,ఇతర అధికారులు, పాల్గొన్నారు.

Share This Post