ఈ నెల 29వ తేదీన మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులను ఆదేశించారు.

బుధవారం రామవరంలో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల గర్భిణిలకు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న పరికరాలు, బెడ్లును పరిశీలించి వైద్యాధికారులకు సలహాలు, సూచనలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆదునాతన టిఫా స్కానర్ను పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించి తగు సలహాలు సూచనలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో అందమైన మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. దహదారికి ఇరువైపులా అందమైన మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, మాతా శిశు ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుజాత, అదనపు వైద్యాధికారులు డాక్టర్ దయానందస్వామి, డా వినోద్, డాక్టర్ నాగేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డిఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post