ఈ నెల 7 నుండి 19 వరకు టి డి.టీకా స్పెషల్ డ్రైవ్..అదనపు కలెక్టర్ రమేష్

ఈ నెల 7 నుండి 19 వరకు టి డి.టీకా స్పెషల్ డ్రైవ్..అదనపు కలెక్టర్ రమేష్

ధనుర్వాతం, కంఠసర్ఫ (డిఫ్థేరియా ) వ్యాధుల నుండి పిల్లలను రక్షించుటకు ఈ నెల 7 నుండి 19 వరకు టి.డి. (టెటనస్ అండ్ డిఫ్థేరియా ) టీకా ఇవ్వనున్నామని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. ధనుర్వాతం రాకుండా గతంలో టెటనస్ టీకా ఇచ్చేవారమని కానీ డిఫ్థేరియా తో పిల్లలు బాధపడుచున్నారని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నుండి టెటనస్ స్థానములో టి.డి. వ్యాక్సిన్ ను ఇస్తున్నారని అన్నారు. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుండి పిల్లలకు పూర్తి స్థాయిలో టీకా ఇవ్వలేకపోయిన దృష్ట్యా ఈ నెల 7 నుండి 19 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 50 శాతం మేర టి.డి. టీకాలు ఇచ్చామని, మిగతా 50 శాతం మందికి టీకాలు ఇచ్చేందుకు పాఠశాలలను వేదికగా చేసుకొని ఈ ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. పాఠశాలలో చదువుచున్న 10 మరియు 16 సంవత్సరాల వయసున్న విద్యార్థులు అనగా 5వ తరగతి, 10 వ తరగతి చదువుచున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థులకు టీకా ఇవ్వనున్నామని రమేష్ తెలిపారు. కాగా బడిబయట ఉన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో ఇవ్వనున్నామని అన్నారు. జిల్లాలో ఈ వయస్సు ఉన్నవారు 25,423 మంది ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఇందులో 10 సంవత్సరాల వయస్సు గల వారు 14,218 మంది కాగా, 16 సంవత్సరాల వయస్సు గలవారు 10,955, బడిబయట ఉన్నవారు 250 మంది ఉన్నారని రమేష్ తెలిపారు.
ప్రతి ఏ.యెన్.ఏం. రోజు 250 డోసు టీకాలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందస్తుగా ఆ పాఠశాలలకు తెలుపుతూ ఒక్క విద్యార్థి మిగలకుండా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని 5, 10 వ తరగతి పిల్లలందరికీ టిడి టీకా తీసుకునేలా అవగాహనా కలిగించాలని, టీకా ఇచ్చేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని, పాఠశాలలో అందరికి టీకా ఇచ్చినట్లు ధ్రువపత్రం ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని ఎస్సి, ఎస్టీ,బి.సి. మైనారిటీ , ఐ.సి.డి.ఎస్. అధికారులు, విద్యా శాఖ సమన్వయంతో పనిచేస్తూ స్పెషల్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని కోరారు. బడి బయట, బడి లోపల ఉన్న 10, 16 సంవత్సరాల పిల్లలు టిడి టీకా వేసుకునేలా అవగాహన కలిగించవలసినదిగా జిల్లా పరిషద్ పంచాయతీ రాజ్, డి..ఆర్.డి.ఓ. అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయ నిర్మల, డీఈఓ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, జిల్లా ఇమ్యూనైజషన్ అధికారి మాధురి, మాస్ మీడియా అధికారి రమ, డాక్టర్ నవీన్, జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్, జిల్లా మహిళా సంక్షేమాధికారి నుండి పద్మ, డిపిఆర్ ఓ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post