ఈ యాసంగిలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశo-అదనపు కలెక్టర్ రమేష్

ఈ యాసంగిలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశo-అదనపు కలెక్టర్ రమేష్

సమృద్ధిగా సాగు నీరు, విద్యుత్ ఉండడం వల్ల జిల్లాలో గత రెండు సంవత్సరాల నుండి పంట దిగుబడి బాగా పెరిగినా అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అందరి సహాకారంతో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో సహకార శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు పై ప్రాథమిక సహాకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సహకార శాఖ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎంత ధాన్యం వచ్చిన అందరి సహకారంతో అధిగమించామని,కానీ ఈ సారి గన్ని సంచుల కొరతతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని, కొత్త సంచులు రావడానికి సమయం పడుతుంది కాబట్టి రైతులు అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర కొనుగోలు కేంద్రాలకు ఇబ్బంది కలగకుండా అవసరమున్న మేరకే గన్ని బ్యాగులకై ఇండెంట్ పెట్టాలని రమేష్ సూచించారు. ఈ యాసంగిలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున గత యాసంగి మాదిరే ప్యాక్స్, ఐ.కె.పి, మార్కెటింగ్ శాఖ ల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు శుభ్రపరచి ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలని, రైస్ మిల్లులు అధికంగా ఉన్నందున, లారీలను ఎక్కువగా సమకూరుస్తునందున రవాణాలో ఇబ్బందులుండవని స్పష్టం చేశారు. ధాన్యం తూకంలో వ్యత్యాసం అనే అపవాదు రాకుండా చూడాలని, విజిలెన్స్ అధికారులు ఏ కేంద్రాలనైనా ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశమునందున అప్రమత్తగా ఉండాలని సూచించారు. అలాగే రైతులు ఒకే సారి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించకుండా రాకుండా నిక్కచ్చిగా వ్యవహరించాలని, రైతులు ఆగ్రహం ప్రదర్శించినా సంయమనం పాటిస్తూ వారికి ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించి ప్రతి గింజ కొంటామని శాంతపరిచేలా చూడాలని అధికారులకు హితవు చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సాయి రామ్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, ఫ్యాక్స్ చైర్మన్లు, కార్యదర్శులు, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post