ఈ – శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికులు ఉచితంగా నమోదు చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్,30:
ఈ – శ్రమ్ పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికులు ఉచితంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ – శ్రమ్ పోర్టల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ – శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసి వారికి సామాజిక భద్రత తో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలన్నారు. ఈ – శ్రమ్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఇందులో చేరిన ప్రతి అసంఘటిత కార్మికుడికి పన్నెండు అంకెల గల ప్రత్యేక గుర్తింపు కార్డు ( యుఏఎన్) ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాల వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఒక సంవత్సరం పాటు ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద 2 లక్షల రూపాయల ప్రమాద మరణ / అంగవైకల్య భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని, ప్రభుత్వ అసంఘటిత రంగ కార్మికులనుద్దేశించి చేసే పథకాలు, విధానాలకు ఈ డాటా బేస్ నే ప్రామాణికంగా తీసుకోనున్నారని, వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో చేరడానికి 16 నుండి 59 సంవత్సరాల వయస్సులోపు వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేనివారు, ఆదాయం పన్ను పరిధిలోనికి రాని వారు, అసంఘటిత కార్మిక కేటగిరీలలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలని అన్నారు. వ్యవసాయ అనుబంధ ఉపాధి రంగాలలో పనిచేసే చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పని వారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన నిర్మాణం మరియు దాని అనుబంధ రంగాల్లో పనిచేసే వారు, తాపీ మేస్త్రి , తవ్వకం, రాళ్లు కొట్టే పని, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, పెయింటర్స్, ఇటుక బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్లు, బావుల తవ్వడం / పూడిక తీయడం, టైలరింగ్ కు సంబధించిన వారు, డ్రైవర్లు, హేల్పర్లు, చేతి వృత్తుల పనివారు, వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు తయారీ దారులు, చిరు వ్యాపారులు, కల్లుగీత, కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త ఏరేవారు, ఈజీఎస్ కార్మికులు, ఇళ్ళలో పనిచేసే పాచి పనివారు, కొరియర్ బాయ్స్, ఇంటి వద్ద రోగులకు సేవలందించే వారు, కమిషన్ మీద వస్తువులు సరఫరా చేసేవారు, , హమాలీలు, బేకరీ, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ తయారీదారులు, వలస కార్మికులు తదితర అసంఘటిత కార్మికులు అర్హులని అన్నారు. ఈ – శ్రమ్ లో నమోదు కావడానికి ఈ కే వై సి కలిగిన ఆధార్, ఆధార్ తో అనుసంధానమైన మొభైల్ ఫోన్ నెంబర్, ఓటిపి ద్వారా/ ఓటిపి సదుపాయం లేని వారు బయో మెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా రన్నింగ్ లో ఉన్న బ్యాంకు అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా నమోదు కావచ్చన్నారు. మీ సమీప ప్రాంతాలలోని గ్రామ/ వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకున్న వెంటనే యుఏఎన్ కార్డు జారీ చేయబడుతుoదన్నారు. ఈ కార్డుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరము లేదని ఈ అవకాశాన్ని జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కె. ప్రసాద్, ఏఎల్ఓ బి. చాణక్య, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడీఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post