ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ సేవలపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా సెషన్స్ జడ్జి రేణుక యార, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రిక ప్రకటన. తేది: 5-11-2021,  వనపర్తి.

“ఆజాది కా అమృత్ మహోత్సవం” లో భాగంగా  నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా సెషన్స్ జడ్జి రేణుక యార తెలిపారు.
శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఉమ్మడి జిల్లాలోని జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, అదనపు కలెక్టర్లు, రెవెన్యు, మెడికల్, తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, పేద ప్రజలు, ఒంటరి మహిళలు, నిరక్ష్యరాస్యులకు  న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవ, సలహా అందుతుందని, వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఉచిత సేవ పొందుటకు చాలా మంది దూరమవుతున్నట్లు, తాము పోగు చేసుకున్న డబ్బులతో ప్రైవేట్ వకీలును నియమించుకోవడం ద్వారా ఎంతో నష్ట పోతున్నట్లు ఆమె వివరించారు. దేశంలోని ప్రతి మహిళకు, ప్రతి ఎస్సి/ఎస్టి లకు, కార్మికులకు, దివ్యాంగులకు న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉచితంగా వకీలు పెట్టుకునే  హక్కు వారికి ఉంటుందని ఆమె సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి న్యాయ సేవాదికర సంస్థలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె వివరించారు.
1987లో అర్టికల్ 39 (ఎ) ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కును  కల్పించడం జరిగిందని, ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో 1995 లో న్యాయ సేవాదికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల  న్యాయ సేవ అధికార సంస్థలు అనేవి జాతీయ స్థాయి నుండి మండల స్థాయి వరకు అందుబాటులో ఉన్నట్లు ఆమె తెలిపారు. బాధితులకు న్యాయ సేవాదికర సంస్థ ద్వారా  నష్టపరిహారం అందించేందుకు అవకాశం ఉన్నట్లు, ఇప్పటి వరకు కేవలం ఒక శాతం జనాభా మాత్రమే ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆమె సూచించారు.
నష్టపరిహారం కింద బాధితులకు గాయాల ద్వారా వైద్య చికిత్స నిమిత్తం రూ. లక్ష నుండి రూ.2 లక్షల వరకు, అంగవైకల్యం ద్వారా రూ.5 లక్షలు,  మరణిస్తే రూ.10 లక్షలు, అత్యాచారం లాంటి కేసులకు రూ 7 లక్షలు, పోక్సో కేసులకు, యాసిడ్ దాడులకు రూ. 7 లక్షల వరకు బాధితులకు పరిహారం చెల్లించడం జరుగుతుందని ఆమె వివరించారు.
సమీప మండల, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయములో దరఖాస్తు చేసుకోవాలని,  ప్రతి జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం ఉంటుందని, టోల్ ఫ్రీ నెంబరు 15100 ద్వారా సేవలు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ”ఆజాది క అమృత మహోత్సవం”లో భాగంగా దేశ వ్యాప్తంగా అక్టోబర్, 2వ.తేది నుండి నవంబర్, 14వ తేది వరకు గ్రామీణ స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె సూచించారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను  ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా  కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని, ఆయా ప్రభుత్వ శాఖలకు వచ్చే ప్రజలకు న్యాయ సేవాదికార సంస్థ ఉచిత సేవలపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరికి సమాన న్యాయం పొందే విధంగా క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.ఏ. రషీద్, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

 

Share This Post