ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్య మేళా ప్రారంభోత్సవ సభలో జడ్పీ చైర్మన్ కలెక్టర్ పిలుపు ప్రభుత్వాసుపత్రుల్లోనే మెరుగైన వసతులు అని వెల్లడి

ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోగ్య మేళా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు తో కలిసి కలెక్టర్ ఈ హెల్త్ మేళాను ప్రారంభించారు. ఈ ఎన్ టి, ఆప్తాల్మిక్, గైనిక్, ఆర్థో తదితర విభాగాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ల్యాబ్ లో రక్త నమూనాల సేకరణను గమనించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆప్తల్మిక్ విభాగంలో జెడ్పి చైర్మన్, కలెక్టర్ ఇరువురూ నేత్ర పరీక్ష చేయించుకున్నారు. మేళాను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ఆరోగ్య మేళాలో ఉచితంగా నిర్వహిస్తున్న టెస్టులను బయట ప్రైవేట్ ల్యాబ్ లో చేసుకుంటే కనీసం పది వేల రూపాయల వ్యయం అవుతుందన్నారు. పేదలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉచితంగా అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోందని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా తీవ్రత కొనసాగిన సమయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారని కొనియాడారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి మళ్లీ క్రమంగా విస్తరిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ కనీస జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే రోజువారి పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం అని అన్నారు. అనారోగ్య సమస్య ఏర్పడిన వెంటనే తగిన వైద్యం చేయించుకోవాలని, లేనిపక్షంలో వ్యాధి మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రక్త నమూనాలను సేకరించి డి- హబ్ కు పంపించడం జరుగుతుందని, అక్కడ 54 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ లో వివరాలు పొందుపరుస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిజిహెచ్, జిల్లా ఆసుపత్రి తో పాటు అన్ని పీహెచ్సీలు, సి హెచ్ సి లు, ఏరియా ఆసుపత్రిలో ను నిష్ణాతులైన డాక్టర్లచే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. వైద్యుల సలహాలను పాటిస్తూ ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ దిశగా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. హెల్త్ మేళాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్, బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ విద్య, ఎంపీపీ రజని, జెడ్ పి టి సి మేక విజయ, సర్పంచ్ రమేష్, ఎంపీడీవో గోపాలకృష్ణ, తహసిల్దార్ శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
———————–

Share This Post