ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు జిల్లాకు అత్యధిక ఉద్యోగాలు దక్కితే అదే మాకు ఎనలేని సంతృప్తి సమైక్య పాలనలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అందుకే కొలువుల భర్తీలో స్థానికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం విదితమే. తాజాగా తన సొంత నియోజకవర్గమైన బాల్కొండ సెగ్మెంట్ కు చెందిన యువత కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయించారు. 850 మంది స్క్రీనింగ్ టెస్ట్ రాయగా, వారిలో మెరిట్ ఆధారంగా 461 మందిని గ్రూప్ ఎగ్జామ్స్ ముందస్తు శిక్షణ కోసం ఎంపిక చేశారు. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబాల యువతకు కూడా న్యాయం జరగాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని అన్నారు. హైదరాబాద్ లో అందించే కోచింగ్ కు ఏమాత్రం తగ్గకుండా మరింత మెరుగైన మెటీరియల్ తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీచే స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని చెప్పారు. సుమారు 57 పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక యాప్ ను సైతం సిద్ధం చేయించామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉచిత శిక్షణ తరగతులను కొలువుల సాధనకు అనుకూలంగా మలచుకోవాలని హితవు పలికారు. జిల్లా నుండి, బాల్కొండ నియోజకవర్గం నుండి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తమకు చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందని, తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అవుతుందన్నారు.
ఇదిలాఉండగా, స్వతంత్రంగా ఉన్న తెలంగాణను అనేక కుట్రలు పన్ని ఇదివరకు ఆంధ్రాలో విలీనం చేశారని, అప్పటి నుండి తెలంగాణ ఉనికి క్రమక్రమంగా మసకబారుతు ఒక్కో రంగం ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్తూ వచ్చిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొడుతూ, వలస పాలకులు తెలంగాణను దుర్భర స్థితిలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల ఆలనా పాలనను విస్మరించారని, తెలంగాణలో సమకూరిన ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతం అభివృద్ధికి వినియోగించారని, చివరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ తెలంగాణ యువతకు హైదరాబాద్ ఫ్రీజోన్ వంటి జీ ఓ లను తెరపైకి తెచ్చి అమలు chesina కారణంగా తీవ్ర అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. దీనిని గమనించిన కేసీఆర్ మలి విడత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గడిచిన ఏడేళ్ల కాలం లోనే లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని వివరించారు. 2 .25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల ప్రైవేట్ రంగంలోనూ 16 లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. తాజాగా 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేయిస్తున్నారని చెప్పారు. కేవలం ఉద్యోగాల భర్తీయే కాకుండా, అవి స్థానికులైన తెలంగాణా బిడ్డలకే దక్కాలనే తపనతో ఏడాదిన్నరగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొలువుల భర్తీలో స్థానికత అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేయించారని అన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే దక్కనున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా యువత స్థానిక కోటా ఉద్యోగాలతో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలను కూడా దక్కించుకుని జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రఘు, ఎంవిఐ సుభాష్, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహనాయుడు తదితరులు ఉద్యోగ సాధనలో తమ అనుభవాలను అభ్యర్థులకు వివరిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, ఉచిత శిక్షణకు ఎంపికైన బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకులు పాల్గొన్నారు.
———————————

Share This Post