ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 27: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా జిల్లాలోని షెడ్యూల్ కులాల యువతకు గ్రూప్స్, ఎస్సై,, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను షెడ్యూల్డ్ కులాల యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షెడ్యూల్ కులాల యువతకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి తో కలిసి బుధవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశంతో నిరుద్యోగ యువత లబ్ది పొందాలన్నారు. గ్రూప్స్ లకు 59 మంది, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 మంది షెడ్యూల్ కులాల యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పోటీ పరీక్షలకు ఇదే చివరి అవకాశం అని భావించి, ఒక్క క్షణం వృధా చేయకుండా లక్ష్యం పై దృష్టి పెట్టాలన్నారు. వాట్సాప్, ఫెస్ బుక్ తదితర సోషల్ మీడియాకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇంటర్నెట్ లో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని, పరీక్షలకు కావాల్సిన విషయాలను ఉచితంగా చదువుకోవచ్చని ఆయన తెలిపారు. అన్ని పాఠ్యoశాలపై పట్టు సాధించాలన్నారు. క్రమశిక్షణతో ప్రతిరోజు శిక్షణకు రావాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వేతనం తక్కువగా ఉన్న సంతృప్తి, సంతోషం ఎక్కువగా ఉంటుందని, ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్గుతుందని ఆయన తెలిపారు. శిక్షణలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, యువత పోలీస్ శాఖలో సక్సెస్ కావాలంటే తప్పకుండా క్రమశిక్షణ ముఖ్యమని, ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన నోటిఫికేషన్లు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే ఫలితం వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కువ గంటలు ఇష్టపడి చదవాలని, కొద్ది రోజులు విందులు, వినోదాల జోలికి వెళ్ళవద్దన్నారు. గ్రామీణ నేపథ్యం నుండి పైకి వచ్చి అంచలంచెలుగా ఎదిగిన అనేక మంది ప్రముఖులు ఉన్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాకు చెందిన యువత పోలీసు కొలువులు, ఇతర పోటీ పరీక్షలకు అంకితభావం, అకుంఠిత దీక్ష తో సన్నద్ధం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి సునీత, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గౌరీ, ఫాకల్టీ సత్యనారాయణ చారి, భూపాలపల్లి సిఐ రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post