ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 07, 2021ఆదిలాబాదు:-

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో చేపడుతున్న పనులపై జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీలో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన పంటలపై ఆసక్తి గల రైతులను ప్రోత్సహిస్తూ, వ్యవసాయ విస్తరణ అధికారుల సహకారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద 26 లక్షల రూపాయలతో 220 హెక్టార్లు, తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం కింద 186 లక్షల రూపాయలతో 585 హెక్టార్లలో సాగు చేయాలనీ లక్ష్యం గా నిర్ణయించి ఆమోదించడం జరిగిందని తెలిపారు. రైతులకు ఉద్యాన సాగు పై రైతువేదికల ముఖంగా సలహాలు సూచనలు అందించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఇంచార్జి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల వరకు ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయని, కూరగాయలు, పండ్లు, తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, సాంకేతిక వ్యవసాయ అధికారి శివకుమార్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post