ఉద్యోగ సాధనే లక్ష్యం అనే ధోరణితో చదివి యువత ఉద్యోగం సాధించాలి -ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు

ఉద్యోగ సాధనే లక్ష్యం అనే ధోరణితో చదివి యువత ఉద్యోగం సాధించాలని ప్రభుత్వ విప్ అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. జి.బి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇస్తున్న పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అచ్ఛంపేట లోని కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండటంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రేరణ (మొటివేషన్) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, ఎస్పీ కె. మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ల ద్వారా దాదాపు 83 వేల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని వీటిలో ఉద్యోగం పొందేందుకు అచ్ఛంపేట నుండి చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగం పొందేందుకు జి.ఆర్.బి. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మీ జీవితం మా బాధ్యత అనే సంకల్పంతో జి.ఆర్.బి. ట్రస్ట్ వ్యవస్థాపకులు గువ్వల అమల హైదరాబాద్ లోని ప్రముఖ మేధా ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి అచ్ఛంపేట నియోజకవర్గంలోని యువతకు ఉచిత శిక్షణ ఇప్పించండం జరుగుతుందన్నారు. మే, 9వ తేదీ నుండి అచ్చంపేటలోని శేష్ ఫంక్షన్ హాల్లొ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల అనుభవజ్ఞులై ఫ్యాకల్టీ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉత్తమమైన స్టడీ మెటీరియల్స్ తో పాటు మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుందన్నారు. దినికి బదులుగా యువత ఉద్యోగం సంపాదించాలి అనే ఏకైక లక్ష్యంతో బాగా చదువుకొని నిరుద్యోగిత అచ్ఛంపేటకు బదులుగా ఉద్యోగస్టుల అచ్ఛంపేటగా పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని తాము అనుకున్న లక్ష్యం సాధించేందుకు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. అచ్ఛంపేట శాసన సభ్యునిగా ఎల్లప్పుడూ నియోజక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జి.బి.ఆర్. ట్రస్ట్ నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ యువత ఏది సాధించాలన్న ఒక ఖచ్చితమైన ధోరణితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లక్ష్యం సాధిస్తారని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. చాలా మందికి ఒక భయం ఉంటుందని, ఇంతమందిలో నేను సాధించగలనా అనే సందేహాలు, అనేక అడ్డంకులు వస్తాయన్నారు. అయితే మన అటిట్యూడ్ వాటన్నింటిని అధిగమించి విజేతగా నిలుపుతుందని తన అనుభావాన్ని తెలియజేసారు. కష్టపడి చదవడం చదివిన వాటికి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. పోలీస్ ఉద్యోగానికి శారీరక దేహదారుడ్యం సైతం అవసరమని అందుకు అనుగుణంగా మరల్చుకోవలసిన అవసరం ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్పీ కె. మనోహర్ మాట్లాడుతూ ప్రెసినాన్షియల్ ఉత్తర్వుల మేరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకె ఇవ్వాలని ఉందని జిల్లాలో దాదాపు 200 పోలీస్ ఉద్యోగాల గాళీలు ఉన్నందున యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
అంతకుముందు శాసన సభ్యులు, వారి సతీమణి, జిల్లా కలెక్టర్ , ఎస్పీ జింకుంట లోని కనకాల మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
జి.బి.ఆర్. ట్రస్ట్ వ్యవస్థాపకులు గువ్వల అమల మాట్లాడుతూ అచ్ఛంపేట నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో మనస్ఫూర్తిగా ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఉచితం కావచ్చు కానీ శిక్షణకు కొన్ని లక్షల రూపాయలు ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందని విద్యార్థులు సద్వినియగం చేసుకోవాలని కోరారు. ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఒక నమ్మకం భరోసా కల్పించాలని సూచించారు. కష్టపడి చదివితే సాధించలేనిది ఏది లేదని జిల్లా కలెక్టర్ ను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు నాయక్, పి.ఓ.ఐ.టి.డి.ఏ అశోక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు పోకల్ మనోహర్, జడ్పిటిసి మంత్ర్యానాయక్, మేధా ఇన్స్టిట్యూట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చిరంజీవి, నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు నిరుద్యోగ యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Post