ఉద్వేగం, ఉద్విగ్నం.. భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం

ఉద్వేగం, ఉద్విగ్నం.. భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం

Media Release Date-17-02-2022

*ఉద్వేగం, ఉద్విగ్నం.. భక్తి పారవశ్యం మధ్య సమ్మక్క తల్లి ఆగమనం*

*సమ్మక్క తల్లి ఆగమనం తో మొదలైన మేడారం మహా జాతర*

*తండోపతండాలుగా తరలి వస్తున్న భక్త జన సందోహం*

*ప్రభుత్వ లాంఛనాలు, ఆదివాసీల సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికిన మంత్రులు*

మేడారం, ఫిబ్రవరి 17:
మేడారం మహా జాతరలో మహా ఘట్టం మొదలైంది. నిన్న సారలమ్మ తల్లి గద్దె లను వేంచేయగా, ఈ రోజు చిలుకలగుట్ట నుండి సమ్మక్క తల్లి గద్దె లను అధిష్టించడానికి బయలు దేరింది. తమ సంప్రదాయ పద్దతిలో ఆలయ పూజారులు పసుపు కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్క అమ్మ వారిని తీసుకొని బయలు దేరారు. ప్రభుత్వ లంచనాలను ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపి అమ్మవారి రాక కు నాందీ పలికారు. ఇదే సమయంలో రాష్ట్ర పర్భుత్వం తరపున రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, దేవాదాయ ధర్మాదాయ, న్యాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లు సమ్మక్క తల్లి కి స్వాగతం పలికారు.

ఇక అక్కడి నుండి ఊరేగింపుగా, లక్షలాది మంది భక్తులు అమ్మ వారికి కేరింతలతో, సమ్మక్క తల్లికి జై అనే నినాదాలతో స్వాగతం పలికారు. అమ్మ వారిని తీసుకువస్తుండగా పూజారులు కాళ్ళకు అడ్డం పడితే పుణ్యం దక్కుతుందన్న నమ్మకంతో అనేక మంది భక్తులు దారిపొడవునా అమ్మవారి రాక కు అడ్డం పడుతున్నారు. అలాంటి వాళ్ళను పక్కకు జరుపుతూ, రోప్ పార్టీ, పోలీస్ లు భారీ బందోబస్తు మధ్య సమ్మక్క తల్లి ని గద్దె మీదకు తీసుకు వస్తున్నారు.

కాగా, అటు చిలకల గుట్ట నుండి గద్దె ల వరకు, మరోవైపు గద్దె ల వద్ద జై సమ్మక్క తల్లి అనే భక్తుల నినాదాలు నట్టడవిలో మిన్నంటుతున్నాయి. మేడారం చుట్టు ముట్టు 50 కి. మీ మేర అడవంతా జన సంద్రమై భక్తి పారవశ్యంతో అమ్మవారి నామ స్మరణతో పులకించిపోతున్నది.
—————————-

Share This Post