ఉన్నత లక్ష్యంతో మంచి భవిష్యత్తు:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్

ఉన్నత లక్ష్యంతో మంచి భవిష్యత్తు:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 2: విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధనకు కృషి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాలలో మంగళవారం జరిగిన ఫ్రెషర్స్ డే (NOVATO VIESTA-2021) కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థికి ఉన్నత విద్యలో డిగ్రీ విద్య ఒక పునాది వంటిదని, ఈ మూడు సంవత్సరాల విద్యా సంవత్సరం భవిష్యత్తుకు ఒక మార్గదర్శనం చేసుకోవాలని ఆయన అన్నారు. డిగ్రి తర్వాత అనేక విద్య మరియు ఉపాధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యార్థులు కష్టంగా కాక, ఇష్టoగా చదవాలని అదనపు కలెక్టర్ అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, గురువులు, కళాశాల, తమ ఊరికి మంచి పేరు తేవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. వడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు తాము కలలుకన్న ఆశయాలను చేరుకోవడానికి నిరంతరం పట్టదలతో చదివి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుకొనెల శ్రీనివాస్ మాట్లాడుతూ, కళాశాలలో అంతర్జాతీయ స్థాయి వసతులు, సదుపాయాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని తెలిపారు.
అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఐక్యూఏసి కోఆర్డినేటర్ వి. వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు డా. మధురాజేశ్, డా. అఫ్సరి ఉస్మాన్, కె. రాజేష్, కళాశాల ఏవో అంజద్ అలీ, వై. నారాయణ, కె. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post