ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలి -రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలి -రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రచురణార్థం

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలి -రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

*రెసిడెన్షియల్ విద్యాలయాల ద్వారా డీగ్రీ వరకు పేదలపై భారం లేకుండా నాణ్యమైన ఉచిత విద్య

*జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్న గురుకుల విద్యార్థులు

*చక్కటి బోధన కల్పించి విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడాలి

*పాఠశాలలో సిసి రోడ్డు నిర్మాణానికి 15 లక్షలు మంజూరు

ధర్మారం మండలం పత్తిపాక జెడ్పీ హై స్కూల్ లో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
————————————————–
ధర్మారం, పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి -07:
————————————————–
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కఠోర సాధన చేయాలని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

మంగళవారం ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 24.41 లక్షలతో మన ఊరు మన బడి కంపొనెంట్ పనులను, ఎన్.ఆర్.జి.ఎస్. క్రింద 61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, డిజిటల్ క్లాస్ రూం ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి ప్రారంభించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, మన ఊరు మనబడి క్రింద 24.41 లక్షలు, ఉపాధి హామీ నిధుల క్రింద 61 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టి, 13 లక్షల విలువ గల సామాగ్రి ఫర్నిచర్ ను పాఠశాలకు అందించడం జరిగిందని, దాదాపు 98 లక్షల ఖర్చుతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేశామని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ అందించాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది సాహోసోపేతమైన నిర్ణయం అని,
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఇంత గొప్పగా చేస్తున్న దాఖలాలు లేవని మంత్రి అన్నారు.

తెలంగాణ రాక పూర్వం పరిస్థితులను బేరీజు వేసుకోవాలని , ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు విద్యా అవకాశాలు పెరిగాయని, 5వ తరగతి నుంచి డీగ్రి వరకు తల్లిదండ్రుల పైభారం పడకుండా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం ఉచితంగాఅందిస్తుందని అన్నారు.

మన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్బుత విజయాలను సాధిస్తున్నారని, దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో సీట్లు వస్తున్నాయని, నీట్, ఐఐటి వంటి అనేక పోటీ పరీక్షలలో నెగ్గుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలలో వోకేషనల్ కోర్సులు సైతం ప్రారంభించామని అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల అభివృద్ధి చేసేందుకు 7 వేల కోట్లకు పైగా వ్యయంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని అన్నారు. పత్తిపాక జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేసామని, విద్యార్థుల కోసం అదనంగా డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఎవరికైనా ఆత్మ విశ్వాసం చాలా అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలో ఏ రంగంలోనైనా రాణించగలమనే విశ్వాసం పెంచుకోవాలని, అభద్రత భావం , అనుమానాలను తీసివేయాలి అని మంత్రి సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన మంచి టీచర్లు ఉన్నారని, పిల్లలు వారిని సంపూర్ణంగా ఉపయోగించుకొని ఎదగాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్ లొ 60 మార్కులకు పైగా సాధించి ఉత్తీర్ణత కావాలని,ఆదిశగాఉపాధ్యాయులు కృషి చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని మంత్రి సూచించారు. పాఠశాలలో సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి 15 లక్షలు మంజూరు చేశారు.

విద్యార్థులుకు చదువు తప్ప వేరే ఏ ధ్యాస ఉండకూడదని, మంచి లక్ష్యాలను నిర్దేశించుకోని పట్టుదలతో సాధించాలని అన్నారు. మన లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడే మనం జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, విద్యార్థులంతా మంచి స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి ముఖ్యమంత్రి ప్రారంభించిన మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద జిల్లాలో మొదటి దశలో 191 పాఠశాలలో 12 రకాల పనులు చేపట్టడం జరిగిందని అన్నారు.

పాఠశాలలో మంచినీటి సరఫరా, రన్నింగ్ వాటర్ తో టాయిలెట్స్ నిర్మాణం, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ పెయింటింగ్, విద్యుత్ పనులు ఫర్నిచర్ వంటివి పూర్తి చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదివే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు గత అక్టోబర్ మాసం నుంచి తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని, తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అవసరమైన స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశామని, వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో సంచార ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరిగే విధంగా చర్యలు తీసుకున్నామని, ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పాఠశాలను టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ అంటారని, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను, పాఠశాలలో
ఉన్న వస్తువులను భద్రంగా కాపాడుకోవడం మన బాధ్యతని, వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. పత్తిపాక జెడ్పి ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమిష్టిగా నిర్వహిస్తున్న రాక్ గార్డెన్, కిచెన్ గార్డెన్, మొక్కల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అంతకుముందు పత్తిపాక గ్రామంలోని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి వాలీ బాల్ ఆట ఆడి యువతలో ఉత్సాహం నింపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాం రెడ్డి, ధర్మారం జడ్పిటిసి పూన్కూరు పద్మజ జితేందర్ రావు, ఎంపీటీసీ బద్దం అజయ్ పాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లు ముత్యాల బలరాం రెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏ.ఎం.సి. చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పత్తిపాక గ్రామ సర్పంచ్ బద్దం సుజాత రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ బండారి శ్రీనివాస్, పత్తిపాక జడ్పీ ఉన్నత పాఠశాల చైర్మన్ జోగుల అంజయ్య, జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ పి.ఎం.షేక్, ధర్మారం తహశీల్దార్ శ్రీనివాస్, పత్తిపాక గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post