ఉపకార వేతన రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, నవంబర్ 10:
ఉపకార వేతన రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్
సిహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, పిజి,వృత్తి విద్యా కోర్సులలో చదువుతున్న
ఎస్సి విద్యార్ధిని, విద్యార్ధుల
ఉపకార వేతనాల మంజూరి గురించి కళాశాలల యజమానులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, పిజి ఇతర వృత్తి విద్యా కోర్సులలో చదువుతున్న ఎస్సి విద్యార్ధిని, విద్యార్ధులకు సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపకార వేతనాల కోసం రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ వెంటనే పూర్తి చేసి ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని గుర్తింపు పొందిన కళాశాలల వారిగా ఎంతమంది ఎస్సి విద్యార్దులు చదువుతున్నారో వారి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు ఖాతాల అనుసంధానంలో తలెత్తేన సాంకేతిక లోపం పై అధికారులకు సూచనలు ఇచ్చి సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. జిల్లాలో విద్యార్ధుల ఉపకార వేతనాలకు సరిపడా నిధులు ఉన్నాయని అధికారులు కళాశాలల యాజమాన్యాలకు సహకరించి, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపకార వేతనాలు అందుకొని చదువు కొనసాగించేందుకు వీలుగా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అంబేడ్కర్ ఓవర్సీస్ ఉపకార వేతనాలు కుడా అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో ఎస్సి అభివృద్థి అధికారి కోర్నెలేస్, ఎల్డిఎం టీవి. శ్రీనివాస రావు, కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post