ఉపాధిహామీ పనులపై దృష్టి పెట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 28: జిల్లాలో ఉపాధిహామీ పనులపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్ తరిగొప్పుల మండలం సోలిపురం, పోతారం, అక్కరాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న సోలిపురం రహదారిని ఆయన పరిశీలించారు. రహదారి మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోతారం గ్రామంలో ఉపాధిహామీ పనుల విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డుల అప్డేషన్ చేయాలన్నారు. లేబర్ టర్నోవర్ పెంచాలన్నారు. ఉపాధిహామీ పనులు చేయడానికి ఉపాధిహామీ కూలీలు సిద్ధంగా ఉన్నట్లు, వారికి పని కల్పించాలన్నారు. రోజూ ఉదయం ఇజిఎస్ పనులను ఎంపిడివో సందర్శన చేసి, ఫోటోలు గ్రూపులో పోస్ట్ చేయాలన్నారు. ఆవెన్యూ ప్లాంటేషన్ పకడ్బందీగా చేయాలని ఆయన అన్నారు. ట్రీ గార్డ్స్ వంగినవి, పడిపోయినవి సరిచేయాలని, మొక్కలకు సాసరింగ్ చేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు వెంటనే నాటాలన్నారు. అక్కరాజుపల్లి పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అర ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం చక్కగా ఉన్నట్లు, వనం లోపల సోలార్ లైటింగ్ కు చర్యలు తీసుకోవాలన్నారు. దాతల సహకారంతో సందర్శకుల సౌకర్యార్థం సిమెంట్ బెంచీల ఏర్పాటుచేయాలన్నారు. పల్లె ప్రకృతి వనం గ్రామస్థులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుందన్నారు. నర్సరీల్లో పండ్ల మొక్కల పెంపకం చేయాలని, నర్సరీ చుట్టూ మొక్కలు నాటి గ్రీన్ ఫెన్సింగ్ చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జనగామ ఆర్డీవో మధు మోహన్, మండల ప్రత్యేక అధికారి పి. శ్రీపతి, తరిగొప్పుల మండల ఎంపిడివో ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్ ఫరీదొద్దీన్, గ్రామాల సర్పంచులు ఎర్ర లక్ష్మి, అంజమ్మ, వీరేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post