సెప్టెంబర్ 14, 2021 – ఆదిలాబాదు:-
ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహిస్తూ పనుల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భీంపూర్ మండలం అందర్ బంద్, గోన గ్రామాలలో మంగళవారం రోజున పర్యటించి సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమం కింద ఉపాధి హామీ కూలీల ద్వారా మొక్కలు నాటించాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని ఆర్థికంగా ఎదిగే విధంగా ఉపాధి కూలీల సంఖ్యను పెంచి ప్రోత్సహించి పనులు చేపట్టాలని అన్నారు. అందర్ బంద్ లోని సేగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామం, ఎవెన్యూ ప్లాంటేషన్ లను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించి అటవీ శాఖ సిబ్బంది సహకారంతో సాంకేతిక సలహాలు తీసుకొని మొక్కల ఎదుగుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకునే విధంగా చూడాలని, సర్పంచ్ కృష్ణకు సూచించారు. అనంతరం గోన గ్రామం లోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థుల హాజరు, వారు నేర్చుకున్న విద్య బుద్ధులను పరిశీలించారు. విద్యార్థులచే A నుండి Z వరకు చదివించడం, ఎక్కాలు చదివించారు. విద్యార్థుల హాజరు సంఖ్యను పెంచుకోవాలని ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్థులే హాజరు అవుతున్నారని, మధ్యాహ్న భోజన నిర్వహిస్తున్న తీరును, వంటలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులు హాజరు, పిల్లలకు అందిస్తున్న భోజనం స్వయంగా రుచిచూశారు.
అనంతరం భీంపూర్ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి సేవల నిర్వహణపై తహసీల్దార్ సోము ను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్, EGS సిబ్బంది తో మాట్లాడుతూ, మండలంలో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని, వర్క్ ఫైల్ రిజిస్టర్ లను క్రమంగా నిర్వహించాలని అన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి అనువైన భూమిని గుర్తించి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గణపతి, మండల విద్యాధికారి శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ మమత, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.